మురుగును తొలగించే జెట్టింగ్ యంత్రాల టెండర్లలో జలమండలి అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతున్నది. కోట్ల రూపాయల విలువైన టెండర్లను తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు మాత్రమే దక్కేలా నిబంధనలు ఇష్టమొచ్చినట్లు మారుస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల 145 జెట్టింగ్ మిషన్ల కోసం ప్రకటించిన టెండర్ విషయంలో అధికారులు ఒకరిద్దరు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
60 రోజుల్లో జెట్టింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నా ఒకరిద్దరు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తున్నది. గడువు ప్రకారం వాహనాలను జలమండలికి అప్పగించకుంటే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి సదరు కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధనలు కొద్ది మందికి వర్తింపజేయడం లేదని సమాచారం. జలమండలి అధికారులు సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీల నుంచి ముడుపులు తీసుకుని వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ)
145 జెట్టింగ్ సీవర్ క్లీనింగ్ యంత్రాల కోసం జలమండలి టెండర్ ప్రకటించినప్పుడు వాహనం ఉన్నవారు మాత్రమే పాల్గొనాలని నిబంధన విధించారు. దాన్ని సవాలు చేస్తూ కొంత మంది కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించగా ఆ నిబంధనను సడలించాలని జలమండలి అధికారులకు సూచించింది. నిబంధనలు సడలిస్తూ రూ.5 లక్షలు డీడ్ ఉన్నవారు పాల్గొనవచ్చని ప్రకటించారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ ఏజెన్సీ వాళ్లు 60 రోజుల్లో వాహనం జలమండలి విధుల్లోకి రావాలని, లేదంటే రూ.5 లక్షల జలమండలికే చెందుతాయని, మరెప్పుడూ టెండర్లో పాల్గొనకుండా సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెడతామన్నారు.
ఇందులో భాగంగానే 145 జెట్టింగ్ సీవర్ క్లీనింగ్ మిషన్ల టెండర్లో మూడు ప్రముఖ కాంట్రాక్ట్ ఏజెన్సీలకు మాత్రం జలమండలి నిబంధనలు వర్తింపజేయడం లేదని, బాధిత కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఓ కాంట్రాక్ట్ ఏజెన్సీ 2 జెట్టింగ్ మిషన్లకు పటాన్చెరు, చందానగర్‌లో మురుగును తొలగించేందుకు కాంట్రాక్ట్ దక్కించుకున్నది.
నిబంధనల ప్రకారం మార్చి 30 నాటికే మిషన్లను అందుబాటులో తేవాల్సి ఉండగా ఇప్పటికి ఏర్పాటు చేయలేదు. దీంతో మిగతా పాత వాహనాలతోనే సిల్టింగ్ పనులు సాగుతున్నట్లు తెలుస్తున్నది. మరో 2 కాంట్రాక్ట్ ఏజెన్సీలు చెరో జెట్టింగ్ యంత్రా లను ఆర్సీపురంలో పెట్టేందుకు కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి.ఆయా ఏజెన్సీలు నిబంధనల ప్రకారం ఈనెల 21 నాటికి వాహనాలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉండగా నేటీకి రాలేదు.
నిబంధనల ప్రకారం ఆ మూడు కాంట్రాక్ట్ ఏజెన్సీల రూ.5 లక్షల డీడీ సొమ్మును స్వాధీనం చేసుకుని, బ్లాక్ లిస్టులో పెట్టాల్సి ఉండగా జలమండలి అధికారులు స్పందించడం లేదని బాధిత కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. జెట్టింగ్ మిషన్ టెండర్ల విషయంలో అధికారులు తమకు అనుకూల కాంట్రాక్టర్లకు ఒకలా.. ఇతర కాంట్రాక్టర్లను మరోలా చూస్తున్నారని బాధిత కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నారు.