హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాంకేతిక విద్యాశాఖ రెండు ముక్కలు కాబోతున్నది. ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలని, ఉద్యోగులను శక్తి (కార్మిక) శాఖ పరిధిలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఇటీవల మంత్రివర్గ సమావేశం పచ్చజెండా ఊపింది. దీంతో ఒకే వ్యవస్థలో పనిచేసే కాలేజీలు, ఉద్యోగులు వేర్వేరు శాఖల పరిధిలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాంకేతిక విద్యాశాఖను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నదని మండిపడుతున్నాయి.
ఏఐసీటీఈ అనుమతులు, సిలబస్, ప్రవేశాలు, సాంకేతిక విద్యా ప్రమాణాల దృష్ట్యా పాలిటెక్నిక్ విద్యకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని స్పష్టం చేస్తున్నాయి. పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయకుండా వ్యవస్థను విభజించడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు నష్టపోతారని పేర్కొంటున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల పరిపాలన, విద్యావ్యవహారాలు, ఉద్యోగుల సర్వీస్ అంశాల్లో సమన్వయం దెబ్బతినే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నాయి. సాంకేతిక విద్యాశాఖ విభజన అనంతరం ఏదైనా సమస్య తలెత్తితే తుది నిర్ణయం ఎవరిది? ఉద్యోగులు ఎవరిని సంప్రదించాలని ప్రశ్నిస్తూ..
ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సాంకేతిక విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన మార్పును ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఏపీలో ఇటీవల సాంకేతిక విద్యాశాఖను రద్దుచేసి, కళాశాల విద్యాశాఖను ఉన్నత విద్యా కమిషనరేట్‌గా మార్చారని, పాలిటెక్నిక్ కాలేజీలు, సాంకేతిక విద్యామండళ్లను విద్యాశాఖ పరిధిలోకి తేవడంతోపాటు కొత్తగా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, శిక్షణ కమిషరేట్‌ను ఏర్పాటు చేశారని గుర్తుచేస్తూ.. మన రాష్ట్రంలోనూ ఇదేవిధంగా చేస్తే బాగుంటుందని పేర్కొంటున్నాయి.
రాష్ట్రంలో సాంకేతిక విద్యామండలి (ఎస్బీటెట్)ని విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించడంతో అందుకు మంత్రివర్గ ఉపసంఘం పచ్చజెండా ఊపింది. కానీ, ఆ తర్వాత కొత్తగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ పరిధిలో నడుస్తున్న ఈ ఈ యూనివర్సిటీని సాంకేతిక విద్యాశాఖ పరిధిలోకి తెస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆ దిశగా ముందడుగు పడలేదు. తాజాగా ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో చేర్చాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖతో ఆటలాడుతున్నదని పాలిటెక్నిక్ జేఏసీ నేతలు ఫైర్ అవుతున్నారు.
రాష్ట్రంలో శక్తిశాఖ ఏర్పాటు, పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ కొత్తగా తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ ఆవిర్భవించింది. ఆఫీస్ సబార్డినేట్స్ నుంచి ప్రిన్సిపాల్స్ వరకు 25 సంఘాలతో కూడిన ఈ జేఏసీ కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. చైర్మన్‌గా నాగరాజు, కన్వీనర్‌గా సురేశ్, సెక్రటరీ జనరల్‌గా శ్రావణ్ కుమార్, శ్రీరామ్, కో-చైర్మన్లుగా సౌజన్య, సునీత, సలహాదారులుగా ఆనంద్, రమణప్రసాద్, రాజా, కృష్ణ, డాక్టర్ చంద్రశేఖర్ ఎన్నికయ్యారు.