ఏ ప్రభుత్వ శాఖలైనా.. అధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఇంకా ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి హెచ్ఎండీఏ, బల్దియా శాఖలు. భక్తనీరాజనాలతో నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడి విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో ఘనంగా నిమజ్జనం చేశారు. అయితే నిమజ్జనం అనంతరం భారీ సంఖ్యలో వ్యర్థాలు పోగయ్యాయి.
వీటిని తొలగించే బాధ్యత హెచ్ఎండీఏ తీసుకున్నా.. వాటిని తరలించి.. రీసైకిల్ వ్యవహారాలన్నీ బల్దియానే పర్యవేక్షిస్తున్నది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. విగ్రహాలకు సంబంధించిన ఉక్కు వ్యర్థాలపై మాత్రం సందిగ్ధత నెలకొంది. వీటిని ఏం చేయబోతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. రెండు శాఖల మధ్య అవగాహన కొరవడటంతో తుక్కు వ్యర్థాలపై కోట్ల ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
-సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ)
Ganesh Immersion | హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాలను నిమజ్జనం చేశాక ఏర్పడే వ్యర్థాల తొలగింపు బాధ్యతలు హెచ్ఎండీఏ తీసుకున్నది. వాటిని తరలించి, రీసైకిల్ పనులను బల్దియానే పర్యవేక్షిస్తున్నది. అలాగే నగరంలోని ఇతర చెరువుల్లో వ్యర్థాల తొలగింపు బాధ్యతను జీహెచ్ఎంసీ తీసుకున్నది. హుస్సేన్ సాగర్ నుంచి తొలగించిన వ్యర్థాలను బల్దియానే తరలిస్తున్నది. కానీ హెచ్ఎండీఏ, బల్దియా మధ్య సమన్వయ లోపం కారణంగా విగ్రహాలకు సంబంధించిన ఇనుము వ్యర్థాలను ఏం చేయబోతున్నారనేది తెలియాలి.
రూ. 5 లక్షల లోపు విలువ చేసే పనులకు టెండర్లు లేకుండానే కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనులు అప్పగించే వీలు ఉండగా, ఇదే ప్రాతిపదికన కోట్లు విలువ చేసే ఐరన్ వ్యర్థాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. గతేడాది తొలగించిన 4వేల టన్నుల ఐరన్ వ్యర్థాలతో జీహెచ్ఎంసీకి రూ. 12 కోట్ల ఆదాయం సమకూరింది. కానీ హెచ్ఎండీఏ పరిధిలో హుస్సేన్ సాగర్‌లోని వ్యర్థాలతో వచ్చే ఆదాయం విషయంలోనే అసలు సమస్య నెలకొంది. ఇరు సంస్థల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇనుము వ్యర్థాల ద్వారా ఆదాయం విషయంలో సందిగ్ధత నెలకొన్నది.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): గతేడాదిలాగానే ఈ సారి కూడా రెండో రోజు వినాయక నిమజ్జనం కొనసాగింది. త్వరగా విగ్రహాలను తరలించేందుకు పోలీసులు మండపాల నిర్వాహకులతో మాట్లాడినా.. రెండోరోజూ ప్రక్రియ సాగింది. మంగళవారం సెంటిమెంట్‌తో అర్ధరాత్రి తరువాత చాలా మంది వినాయకులను నిమజ్జనానికి తరలించారు.
దీంతో హుస్సేన్‌సాగర్ వైపు గణనాథులు బారులు తీరాయి. కొన్ని చోట్ల భారీ వాహనాలు మొరాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇలాంటి కారణాలతోనే విగ్రహాల నిమజ్జనాలు రెండ్రోజులు కొనసాగాయి. బుధవారం వర్కింగ్ డే కావడంతో బారులు తీరిన గణనాథులతో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేలా పోలీసులు చర్యలు చేపట్టారు. వేగంగా నిమజ్జనాలు చేయిస్తూ.. 10.30 వరకు ప్రధాన రోడ్లలోని వినాయక విగ్రహాలను ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు వైపునకు మళ్లించారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): వినాయక నిమజ్జనం సందర్భంగా వెలువడిన వ్యర్థాల వెలికితీత పనులను పూర్తి చేసి ‘క్లీన్ హుస్సేన్‌సాగర్’గా మార్చేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ చర్యలు వేగవంతం చేశాయి. వినాయక విగ్రహాల తాలూకు వ్యర్థాల తొలగింపు పనులు నిర్విరామంగా కొనసాగిస్తున్నాయి. నిమజ్జనం అయిన వెంటనే విగ్రహాలు, వాటికి సంబంధించి అవశేషాలు, పూలు, పత్రి ఇతర చెత్తా చెదారాన్ని వెనువెంటనే తొలగించారు.
బుధవారం రాత్రి వరకూ హెచ్ఎండీఏ 5500 మెట్రిక్ టన్నులు, 10 రోజుల్లో రోజుకు సరాసరి 8,130 మెట్రిక్ టన్నులు వ్యర్థాలను తొలగించినట్లు బల్దియా అధికారులు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా పెద్దఎత్తున ఏర్పడిన చెత్త, వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు కృషి చేశామని, మండపాలు, 73 కొలనుల వద్ద చెత్త సేకరణకు 3వేల మంది పారిశుధ్య కార్మికులు 24 గంటల పాటు పనిచేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగిందని, అన్ని శాఖల సమన్వయంతోనే సాధ్యమైందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో డిప్యూటీ కమిషనర్లు, యూబీడీ, యూసీడీ, పోలీస్, విద్యుత్ విభాగాల అధికారులు శోభాయాత్ర సందర్భంగా ఎదురయ్యే సమస్యలను ముందుగా గుర్తించి.. రోడ్డు మరమ్మతులు, చెట్ల కొమ్మలు తొలగించడం, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి పనులు చేపట్టినట్లు చెప్పారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు.
ఇదే స్ఫూర్తితో మున్ముందు చేపట్టబోయే పనులు విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. గురువారం జరిగే మిలాద్- ఉబ్ -నబీ వేడుకలు చార్మినార్‌లో నిర్వహించే అవకాశం ఉన్నందున ప్రధాన, అంతర్గత రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలో అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని, వారి సేవలు అభినందనీయమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.