సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : పోలీసునంటూ(Fake police) అమాయకులను బెదిరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ఇరానీ గ్యాంగ్(Irani gang) సభ్యుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ సుధీంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బీదర్‌లోని ఇరానీ గల్లీకి చెందిన జాఫర్ అలీ అలియాస్ లంబు పాత నేరస్థుడు. హైదారాబాద్‌లో వ్యాపారాలు ఎక్కువ జరిగే ప్రాంతాలలో తిరుగుతుంటాడు. ఒంటరిగా డబ్బుతో వెళ్లే వారిని ఆపి తాను పోలీసునంటూ చెప్పుకుంటాడు.
నకిలీ ఐడీ కార్డును చూపిస్తూ తనిఖీ చేయాలంటూ బెదిరించి సదరు వ్యక్తుల వద్ద ఉన్న కాడికి దోచేస్తాడు. ఇలా బేగంబజార్, సుల్తాన్‌బజార్, కుల్సుంపురా, లంగర్‌హౌస్ ప్రాంతాలలో పలువురిని మోసం చేయడంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడు ఇరానీ గ్యాంగ్ సభ్యుడని గుర్తించి పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడి వద్ద నుంచి రూ. 95 వేల నగదు, కర్ణాటక రాష్ర్టానికి చెందిన పోలీస్ నకిలీ ఐడీ కార్డు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.