సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రెండునెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ మరో సీజన్ కొనసాగుతోంది. మార్చి 28న ప్రారంభమైన ఈ మెగా లీగ్ మే 31వరకు జరగనుంది. క్రికెట్ ఆటగాళ్ల విన్యాసాలను చూసేందుకు అభిమానులు ఆశగా ఎదురుచూస్తుంటే మ్యాచ్‌ల గెలుపు ఓటములు, ఆటగాళ్ల ప్రదర్శనపై రూ.లక్షలు బెట్టింగుల పేరుతో చేతులు మారుతున్నాయి. బరిలో బంతాట సాగుతుంటే బయట బుకీల దొంగాట సాగుతున్నదని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. బెట్టింగ్ దందాకు చెక్ పెట్టడానికి నగర పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినా బెట్టింగ్‌ను మాత్రం అరికట్టలేకపోతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి కొత్తగా ప్రిడిక్షన్స్ పేరిట ఆన్లైన్లో గెలుపు ఓటములు చెబుతూ సైబర్ క్రైమ్ చేస్తున్న ముఠాల ఆగడాలు పెరిగిపోయాయని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి ప్రమోషన్ల విషయంలో గత నెలరోజుల్లో 494 పెయిడ్ ప్రకటనలను, ప్రచారం చేస్తున్న 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను బ్లాక్ చేయించారు.
దుబాయ్ ప్రధాన కేంద్రంగా బెట్టింగులు
ఐపీఎల్ సీజన్ మొదలుకాగానే నగరంలో రూ.లక్షల బెట్టింగులు నడుస్తున్నాయి. ప్రధానంగా క్రికెట్ అభిమానులు, యువత బెట్టింగులో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం ఒక గ్రూపుగా ఏర్పడి లక్షల్లో బెట్టింగులు పెడుతున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు దుబాయ్ కేంద్రంగా బెట్టింగ్ నెట్వర్క్ నడుస్తున్నదని పోలీసులు చెప్పారు. అక్కడి నుంచి సాఫ్ట్వేర్ లింకులు, వెబ్సైట్ అడ్మిన్ ఐడీలను స్థానిక బుకీలకు అమ్ముతుండగా నగరంలోని బుకీలు వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రహస్య గ్రూపులు ఏర్పాటు చేసి పందేలు కాస్తున్నారు.
ఐపీఎల్ ప్రిడక్షన్ పేరిట ఆన్లైన్ ఉచ్చు..
ఐపీఎల్ క్రికెట్ ఫీవర్‌ను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియలో కొందరు మోసపూరిత ప్రకటనలతో విరుచుకుపడుతున్నారని వారి మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దంటూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ ఒక ప్రకటనలో యువతను హెచ్చరించారు. టాస్ ఎవరిది, మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుందో ముందే చెబుతామంటూ తమ చానెల్స్‌లో సబ్స్ర్కైయిబ్ చేయించుకుని, నిలువునా ముంచే బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారని, ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రమోషన్ల విషయంలో పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని బెట్టింగ్ నిర్వాహకులను హెచ్చరించారు.