హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాడ మాస బోనాల ఉత్సవాలను ఆగస్టు 2వ తేదీన నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్ పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలిశారు.
ఆషాఢమాస బోనాల ఉత్సవాల వివరాలను తెలియజేస్తూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఆహ్వాన లేఖను అందజేశారు. జులై 19 వ తేదీన ఘటాల ఊరేగింపు ప్రారంభం అవుతుందని, ఆగస్టు 2 వ తేదీన అమ్మవారికి బోనాల సమర్పణ, 3 వ తేదీన రంగం (భవిష్య వాణి) ఉంటాయని ఈవో వివరించారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్ పేట డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, రాం మోహన్ యాదవ్, తదితరులు ఉన్నారు.