Siddarth Neuro Hospital | మాదాపూర్, ఫిబ్రవరి 10 : మృతదేహానికి 2 రోజులపాటు చికిత్స చేసి రూ. 13 లక్షలు దండుకొని బాధితులకు శవాన్ని అప్పజెప్పిన మదినగూడ సిద్ధార్థ న్యూరో హాస్పిటల్‌పై రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ సోమవారం దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి మదినగూడ లోని సిద్ధార్థ న్యూరో హాస్పిటల్‌ను పరిశీలించి దవాఖాన యాజమాన్యంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా నందమూరి గ్రామానికి చెందిన జి. సుహాసిని చనిపోవడానికి గల కారణాలను, ఆమెకు వచ్చిన జబ్బును, ఆమెకు ఎటువంటి చికిత్స చేశారు.. అనే కోణంలో హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు అడిగిన ప్రశ్నలకు హాస్పిటల్ యాజమాన్యం చెప్పిన సమాధానాలు పొంతన లేకపోవడంతో వారిపై మండిపడ్డారు.
ఆపరేషన్ థియేటర్ సీజ్ చేసిన డిఎంహెచ్ఓ..
చనిపోయిన మృతదేహానికి 2 రోజులుగా చికిత్స చేసి వారి వద్ద భారీగా డబ్బులు దండుకున్న ఘటనపై రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయ పూర్ణిమ సిబ్బందితో కలిసి దర్యాప్తు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ ఎండి సిద్ధార్థ రెడ్డి తో పేషంట్ ఎలాంటి పరిస్థితుల్లో దవాఖానకు వచ్చారని, ఆమెకు ఎటువంటి వైద్యం అందించారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చికిత్సకు సంబంధించిన కేస్ షీట్స్ తీసుకొని ఆధారాలు సేకరించారు.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పేషంట్ చనిపోవడానికి కారణమైనట్లు నిర్ధారణ అయితే దవాఖాన యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం దవాఖానాలో 28 మంది పేషెంట్లు ఉన్నారని, తర్వాత వచ్చే కొత్త పేషెంట్లను చేర్చుకోవద్దని ఆయన ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం ఆపరేషన్ థియేటర్‌ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. మరో రెండు రోజుల్లో లోతుగా దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు సోమవారం రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి సిద్ధార్థ హాస్పిటల్ ను పరిశీలించి దర్యాప్తును ముమ్మరం చేశారు.
Power Demand | తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. మండుతున్న ఎండలే కారణం..!
KTR | హిమాయత్‌నగర్ చౌరస్తాలో గులాబీ జెండా ఎగురవేసిన కేటీఆర్