సిటీబ్యూరో, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): వాళ్లం తా ఉన్నత విద్యావంతులు.. ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరొకరు ఐఐఐటీలో బిటెక్ పూర్తిచేశారు. ఇంకొకరు ఆర్కిటెక్, మరొకరు ఆర్కిటెక్ కాగా.. వీరంతా తమ చదువులకు తగ్గ ఉద్యోగాల్లో ఆదాయం తక్కువగా వస్తుందని ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కారు. ప్రమాదకర హైడ్రోపోనిక్ గంజాయిని సరఫరా చేయడం, అమ్మకాలు చేయడం ద్వారా అధిక ఆదాయం కోసం అర్రులుచాచి చివరకు పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, టాస్క్‌ఫోర్స్, నల్లకుంట పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్, గంజాయి పట్టుబడ్డాయి. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ కమిషనరేట్ క్రైమ్ విభాగం అడిషనల్ సీపీ విశ్వప్రసాద్విశ్వప్రసాద్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైఎస్ సుధీంద్రలు మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
తాము నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో రూ.1.4కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయిలు పట్టుబడ్డాయని, వినియోగదారులే డ్రగ్స్ పెడ్లర్లుగా మారుతున్నారని విశ్వప్రసాద్ తెలిపారు. ఉన్నత విద్యావంతులు డ్రగ్స్ పెడ్లర్లు, సప్లయిర్స్గా మారడం ఆశ్చర్యకరంగా ఉందని, తాము సంపాదించే సంపాదన సరిపోక అదనపు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కినట్లు అడిషనల్ సీపీ తెలిపారు. అంతర్రాష్ట్రీయ డ్రగ్ సప్లయర్ మధ్యప్రదేశ్ జబల్పూర్కు చెందిన హర్షవర్ధన్ శ్రీవాస్తవ అలియాస్ హర్ష్ పూణెలోని ఆయోజన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి బీఆర్క్ పట్టా పొందారు. ఈసమయంలో అధికంగా డబ్బు అవసరమై తను చేస్తున్న ఆర్కిటెక్చర్ ఇంటర్న్‌షిప్ ఆపేసిన హర్షవర్ధన్ డబ్బు సంపాదన కోసం రెడిట్ కమ్యూనిటీ ద్వారా డ్రెట్ మార్కెట్ నుంచి డ్రగ్స్‌ను ఎలా సేకరించాలి, సరఫరా చేయాలో నేర్చుకున్నాడని విశ్వప్రసాద్ తెలిపారు. హర్షవర్ధన్ ఒక్కరోజే పదిలక్షలు, మిగతా రోజుల్లో లక్షల్లో ట్రాన్సాక్షన్ యాప్ ద్వారా బదిలీ చేశాడని, డీటీడీసీతో పాటు ఇతర కొరియర్ల ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్నారని తెలిపారు.
ఇందులో పోలీసుల కళ్లు కప్పేలా హవాలా ఆపరేటర్స్, క్రిప్టో కరెన్సీ ప్రమేయం ఉందన్నారు. మరో డ్రగ్ పెడ్లర్ చెన్నైకి చెందిన శ్రీనివాసరాహుల్ అలియాస్ రాహుల్ చెన్నైలో ఐటీఎంప్లాయిగా పనిచేస్తున్నాడు. అతనికి గంజాయి తీసుకునే అలవాటు ఉండడంతో కొన్ని రోజుల తర్వాత గంజాయి పెడ్లర్మరియు రవాణాదారుగా మారాడని విశ్వప్రసాద్ చెప్పారు. దీంతో అతను చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో డ్రగ్స్ పెడ్లర్స్‌కు సప్లై చేసేవాడని , స్నాప్‌చాట్, వివిధ యాప్స్ ద్వారా ఎక్కువగా డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. లోకల్ డ్రగ్ పెడ్లర్ అభిషేక్ ఐఐఐటీ రాయ్‌పూర్ నుంచి బిటెక్ కంప్లీట్ చేశాడు. డ్రగ్స్ వాడే క్రమంలో శ్రీనివాసరాహుల్, హర్షవర్ధన్ ద్వారా ఓజీని, మ్యాజిక్ మష్రూమ్స్‌ను ప్రొక్యూర్ చేసి సిగ్నల్ యాప్ ద్వారా వారితో సంప్రదింపులు జరపడం, హవాలా ద్వారా డబ్బులు పంపేవాడని విశ్వప్రసాద్ వెల్లడించారు.
ఈక్రమంలో సికింద్రాబాద్‌కు చెందిన ధావల్తో పాటు మరికొంత మంది గంజాయి వినియోగదారులకు నేరుగా అభిషేక్ అందించేవారని , అంతేకాకుండా మరో సబ్పెడ్లర్ సికింద్రాబాద్‌కు చెందిన అభిషేక్ కుమార్ ద్వారా మరికొందరికి అమ్మేవారని, అభిషేక్ కుమార్ తాను చెన్నై సత్యభామ ఇన్స్టిట్యూట్ నుంచి బీఆర్క్ పట్టా పొంది లైసెన్స్డ్ ఆర్కిటెక్‌గా పనిచేస్తూ అధిక డబ్బుల కోసం డ్రగ్స్ సప్లై చేసేవాడని విశ్వప్రసాద్ తెలిపారు. ఈ డ్రగ్ పెడ్లర్లంతా ఉన్నత చదువులు చదివి జల్సాలు,ఈజీమనీ కోసం డ్రగ్ పెడ్లర్లుగా మారారని ఆయన చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకు నల్లకుంటలో దాడులు నిర్వహించి డ్రగ్ పెడ్లర్ హర్షవర్ధన్, సప్లయ్ కం పెడ్లర్ శ్రీనివాసరాహుల్, లోకల్ పెడ్లర్స్ అభిషేక్, దవల్ను అదుపులోకి తీసుకున్నామని,ఈ దాడుల్లో 1380 గ్రాముల హైడ్రోపోనిక్ గంజా, 44 ఎల్ఎస్డి బోల్డ్స్, 10వేల రూపాయల డబ్బు, 6 మొబైల్స్, 2 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో హెచ్‌న్యూ ఇన్స్పెక్టర్ జీఎస్ డానియల్, ఎస్ ఐ వెంకట్రాములు, నల్లకుంట ఎస్హెచ్ఓ జగదీశ్వర్‌రావు, ఎస్ఐ శ్రీనివాసరావులతో పాటు హెచ్‌న్యూ, నల్లకుంట పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.