సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌పై అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు గురిపెట్టాయి.. గతంలో హైదరాబాద్ వైపు చూడాలంటేనే భయపడే ఈ ముఠాలు… ఇప్పుడు నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నాయి. పెట్రోలింగ్ వ్యవస్థ అస్తవ్యవస్తంగా మారడంతో దొంగలు ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దొంగతనం చేసిన ముఠాలు పోలీసులు కండ్లు తెరిచే వరకు తమ పని పూర్తి చేసుకొని సిటీని దాటేస్తున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్ వైపు చూడాలంటే వణుకు పుట్టేది. హైదరాబాద్ పోలీసులంటే ఇటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడేవారు. అప్పట్లో స్నాచింగ్‌లు, దొంగతనాలు, దోపిడీలను ఉక్కుపాదంతో అణిచివేసిన పోలీసులు… నేడు ఆయా నేరాలను తేలికగా తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక పక్క సైబర్‌క్రైమ్ పెరుగుతుండగా, మరో పక్క సాధారణ నేరాలు కూడా పెరుగుతుండడంతో ఆందోళన కల్గిస్తోంది. ఎక్కువగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బిహార్ రాష్ర్టాలకు చెందిన అంతర్రాష్ట్ర దొంగలు నేరాలకు పాల్పడుతుండడం ఆందోళన కల్గిస్తోంది. స్థానికంగా ఉండే రౌడీషీటర్లు కత్తులతో హాల్చల్ చేస్తూ పట్టపగలు హత్యలు, హత్యాయత్నాలు చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుండగా.. ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు తుపాకులతో దోపిడీలు, శివారు ప్రాంతాల్లో ఇండ్లకు కన్నం వేస్తూ ప్రజల ఆస్తులను దోచేస్తున్నాయి.
ఇటీవల రాచకొండ పోలీసులు అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. శివారు ప్రాంతంలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో దొంగతనానికి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను .. వారివారిరాష్ర్టాలకు వెళ్లి పట్టుకున్నారు. యథేచ్ఛగా నగరంలో తిరుగుతూ రాత్రి అయ్యిందంటే లక్ష్యంగా చేసుకున్న ఇండ్లను, వ్యాపార సముదాయాలను దోచేస్తున్నారు. వీటికితోడు పగలు, రాత్రి అనే తేడా లేకుండా స్నాచింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్న ఘటనలున్నాయి. సీసీ కెమెరాలతో పోలీసులకు ఆధారాలు లభిస్తేనే ఆయా దొంగలను గుర్తించి పట్టుకుంటున్నారు. అంబర్‌పేట్‌లో వృద్ధ దంపతుల హత్య కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. సీసీ కెమెరాల్లో పోలీసులకు ఏ మాత్రం చిక్కకుండా హంతకులు పకడ్బందీ ప్లాన్‌తో తమ పని ముగించుకొని వెళ్లిపోయారు. ఇలా ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న దోపిడీ, దొంగతనాలు, స్నాచింగ్‌లు సామాన్య ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
పెట్రోలింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో…
ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండే పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం ఆ పరిధిలో తిరుగుతూ ఉండడంతో దొంగలకు పోలీసులు ఉన్నారనే భయం ఉంటుంది. అయితే చాలావరకు పెట్రోలింగ్ వాహనాలు పూర్తిస్థాయిలో పనిచేయడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. వీటి పర్యవేక్షణకు సంబంధించిన వ్యవహారాలను పట్టించుకునేవారు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉందంటూ సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు.
శివారు ప్రాంతాలు కావడంతో ప్రజల సంచారం తక్కువగా ఉంటుంది.. ఒక కాలనీకి.. మరో కాలనీకి మధ్య దూరం కూడా ఉంటుంది. దీంతో రాచకొండ, సైబరాబాద్ శివారులోని గ్రామీణ వాతావరణం ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనాలు ఎప్పుడో ఓసారి తిరుగుతుంటాయని స్థానికులు వాపోతున్నారు. పట్టణ ప్రాంతంలోనే పరిస్థితి అంతంత మాత్రంగా ఉండగా, ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకోవచ్చని సామాన్య ప్రజలు చెబుతున్నారు. ఈ నెలలో జగద్గిరిగుట్టలో జరిగిన రౌడీషీటర్ హత్య సంచలనం సృష్టించింది. ఇద్దరు రౌడీషీటర్లు గొడవ పడుతూ, ఓ రౌడీషీటర్ కత్తితో విచక్షణ రహితంగా మరో రౌడీషీటర్‌ను పొడిచి చంపాడు. పోలీసులు నిందితులను పట్టుకున్నా, పెట్రోలింగ్ వ్యవస్థ సరిగ్గా ఉంటే పోలీసులు వస్తారనే భయం వారిలో ఉండేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.
నగరంలో జరిగిన కొన్ని ఘటనలు..
గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌కు చెందిన దొంగల ముఠా బాటాసింగారంలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో గత నెలలో 1.07 కోట్లు దొంగతనానికి పాల్పడ్డారు. ఐదు మంది ఉన్న ఈ దొంగల ముఠాలో ఇద్దరిని రాచకొండ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.