సిటీబ్యూరో, అక్టోబర్ 07, (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీసులంటే అప్పట్లో దొంగలకు హడల్.. వారు ఎంత తెలివిగా నేరాలు చేసినా పోలీసులు వారిని పట్టుకోవడంలో ఖచ్చితంగా విజయం సాధించేవారు. సిటీ పోలీసుల పేరు చెబితే దొంగలకు ముచ్చెమటలు పట్టేవి. సిటీ శివారులోకి రావాలంటేనే వారిలో అలజడి వచ్చి కొన్నేళ్లపాటు వారు భాగ్యనగరానికి రావడమే మానేశారు. ఇదంతా తెలంగాణ వచ్చిన తరవాత పదేండ్ల వైభవం. ఇప్పుడా పరిస్థితి లేదు.
దేశంలోనే బెస్ట్ పోలీసింగ్‌గా ఉన్న హైదరాబాద్ పోలీస్ ప్రస్తుతం చేష్టలుడిగిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నగరాన్ని అంతర్రాష్ట్ర నేరగాళ్ల ముఠాలు భయపెడుతున్నాయి. దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, అక్రమ ఆయుధాలు.. ఒకటేమిటి.. దాదాపుగా నగరంలో జరిగే ప్రధాన నేరాల్లో వారే నిందితులుగా ఉన్నారు.
పోలీసులకు చిక్కకుండా, చిక్కినా తప్పించుకుంటూ అడుగడుగునా సవాల్ విసురుతున్న అంతర్రాష్ట్ర ముఠాలు ఇటీవల కార్మికుల్లో అలజడి సృష్టిస్తున్నాయి. చిన్నచిన్న వాటికి తగాదాలు పెంచుకుంటూ స్థానికులపై దాడులకు తెగబడుతున్నారు. అడ్డొచ్చే పోలీసులను సైతం వదలకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనలు కొన్ని వెలుగులోకి వస్తున్నా.. మరికొన్ని ఎక్కడికక్కడే సద్దుమణుగుతున్నాయి. చిన్నచిన్నగా మొదలవుతున్న ఈ ఘటనలు భవిష్యత్‌లో పెను ప్రమాదానికి దారితీసేలా ఉంటున్నాయంటూ సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
గత 20 నెలల్లో పోలీసులను కలవరపెడుతున్న ఘటనల్లో ప్రధాన నిందితులంతా మధ్యప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్ రాష్ర్టాలకు చెందినవారే కావడం గమనార్హం. అఫ్జల్‌గంజ్ కాల్పులు మొదలుకొని రాచకొండలో అక్రమాయుధాల రవాణా, దోపిడీలు, హత్యల్లో వారి పాత్రే కీలకంగా ఉంటోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇటీవల జరిగిన కేసుల్లో అంతర్రాష్ట్ర గ్యాంగ్‌ల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.
అయితే వారిలో కొందరు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుపోతున్నారని తెలుస్తోంది. కొన్ని కేసుల్లోనైతే నిందితులు ఇంతవరకు పోలీసులకు చిక్కలేదంటే వారు ఎంత పకడ్బందీ ప్రణాళికతో నేరం చేశారో అర్ధమవుతున్నదని ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. సుపారీ గ్యాంగుల్లో కూడా ఈ అంతర్రాష్ట్ర ముఠాల ప్రమేయం ఉన్నట్లు కొన్ని ఘటనల్లో బయటపడుతున్నాయి.
డబ్బులే వీరి ప్రధాన లక్ష్యం
దొంగతనాలు, దోపిడీలు, అక్రమాయుధాల రవాణాల్లో డబ్బులే ప్రధానంగా అంతర్రాష్ట్ర దొంగలు నేరాలకు పాల్పడుతున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన ఐదారుగురు ఒక ముఠాగా ఏర్పడి ఈ నేరాలు చేస్తారు. బిరోల్‌కు చెందిన ముఖియాలతో కూడిన అనేక ముఠాలు దేశవ్యాప్తంగా ఇలాంటి నేరాలు చేస్తున్నాయని పోలీసులు గుర్తించారు. అయితే వీరంతా పాత్రధారులేనని, ప్రధాన సూత్రధారి మాత్రం అదే ప్రాంతానికి చెందిన రాహుల్ అని పోలీసులు చెప్పారు.
ప్రస్తుతం రాహుల్ నేపాల్ సరిహద్దుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేరాలు చేసేవారికి అంత ఖరీదైన సొత్తు విక్రయించే సామర్థ్యం లేకపోవడంతో వారి లీడరైన రాహుల్‌కు ఆ సొత్తు అప్పగిస్తారని, దాన్ని అతను విక్రయించి, సొమ్ము చేసి, వచ్చిన డబ్బుల్లో ఎక్కువ వాటా తను తీసుకుని మిగిలింది నేరంలో పాల్గొన్న వారి కుటుంబసభ్యులకు అప్పగిస్తారని ఓ పోలీసు అధికారి తెలిపారు. బీహార్ రాష్ర్టానికి చెందిన ఈ ముఠాలు పగటిపూట అంతా ఆటోలో రెక్కీ నిర్వహిస్తాయి.
రాత్రి సమయంలో ఇళ్లల్లో చొరబడి దొంగతనాలకు పాల్పడతాయి. ఎవరైనా అడ్డుకుంటే మారణాయుధాలతో దాడి చేస్తారు. ఇది ఒక తరహా అయితే రెండు మూడు నెలల పాటు ఒక దగ్గర ఇల్లు కిరాయికి తీసుకుని చోరీకి లక్ష్యాన్ని పెట్టుకుని అక్కడ పని మనుషులుగా చేరడమో లేక రెక్కీ చేయడమో చేసి ఆ తర్వాత పక్కా ప్లాన్‌తో పని కానిచ్చేస్తారు. కొవిడ్ సమయంలో తెలంగాణకు పనుల కోసం వచ్చిన వారిలో కొందరితో ఉన్న బంధుత్వంతో బీహార్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఈ ముఠాలు ఇక్కడికి వస్తున్నట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది.
48గంటల్లో ఛేదన విఫలమైందా..?
హైదరాబాద్‌లో నేరాలు జరగొద్దని, ఒకవేళ జరిగితే కేవలం 48గంటల్లో వాటిని ఛేదించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీసులు పనిచేశారు. అందులో టాస్క్‌ఫోర్స్ కీలకంగా పని చేయడమే కాకుండా కేసులను పరిష్కరించి నిందితులను పట్టుకోవడంలో దేశంలోనే ఒక మార్క్ సాధించారు. కానీ ఇప్పుడు టాస్క్‌లు ఎక్కువైనా ఆ ఫోర్స్ మాత్రం కనిపించడం లేదనే విమర్శలున్నాయి.
అసలు నిందితులను ఒకట్రెండురోజుల్లో పట్టుకున్న సందర్భాలు చాలా తక్కువనీ, అది కూడా సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ పోలీసుల్లో నాటి ఉత్సాహం కనిపించడం లేదనే విమర్శలున్నాయి. అందుకు కారణం ప్రస్తుతం ప్రభుత్వం పోలీసుల విషయంలో పైకి చెబుతున్నంతగా అనుకూలత లేకపోగా, వారిపై ఒత్తిడి పెంచే చర్యలు పెద్ద ఎత్తున తీసుకుంటున్నదనే చర్చ జరుగుతోంది. దర్యాప్తులో పోలీసు అంతర్గత విభాగాల మధ్య సమన్వయం కొరవడిందని, దీంతో వాళ్లు చూసుకుంటారులే అన్న ధోరణి వచ్చిందని ఓ సీనియర్ అధికారి చెప్పారు.
పోలీసులకు సవాల్ విసురుతున్న ముఠాలు
నగరంలోని ట్రై కమిషనరేట్ పోలీసులకు అంతర్రాష్ట్ర గ్యాంగ్‌లు సవాల్ విసురుతున్నాయి. నేరం చేసి తప్పించుకోవడం, అందులోనూ పెద్ద పెద్ద నేరాలతో ప్రజల్లో భయాందోళనలు పుట్టిస్తుండడంతో పోలీసులకు ము ఠాలను పట్టుకోవడం తలనొప్పిగా మారింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్‌లోని పలు ప్రాంతాలకు చెందిన వారు గ్యాంగులుగా ఏర్పడి నగరంలోని కొన్ని ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
నేరం జరిగిన త ర్వాత వారి కదలికలను బట్టి వారి జాడను కనిపెట్టే ప్రయత్నంలో పోలీసులు పూర్తిగా సక్సెస్ కాలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నా యి. అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపిన నిందితులు, ఇళ్లల్లో దోపిడీలు చేసి, మర్డర్లు చేసిన కేసుల్లో ఉన్న నేరగాళ్లను పట్టుకోవడంలో పోలీసులు వెనకబడిపోతున్నారు. టెక్నాలజీ, క మ్యూనికేషన్ పరంగా ఈ నేరగాళ్లు స్థానికుల సహకారం తీసుకుంటున్నారని పోలీసులు చె బుతున్నప్పటికీ తమకు సహకరిస్తున్న వారికి పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు బీహార్ సరిహద్దులనుంచి నేపాల్‌కు వెళ్లడం సులువుగా ఉండడంతో తెలంగాణలో నేరాలు చేసిన వారు నేపాల్‌కు పారిపోయి అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు.
నగరంలో జరిగిన సంఘటనలు
నగర శివారు సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో ఓ పరిశ్రమ వద్ద ఐదుగురు యువకులపై దసరా రోజు బీహార్ వాసులు దాడులకు దిగారు. కిరణ్ అనే యువకుడిపై దాడి చేశారు. ఎందుకు దాడి చేశారంటూ అడగడానికి వెళ్లిన స్థానికులు విష్ణు, మధు, సూరజ్‌తోపాటు మరో యువకుడిని అక్కడున్న బీహార్‌వాసులు విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో బాధితులు తీవ్రగాయాల పాలవడంతో ఇస్నాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఖజానా జ్యువెల్లరీ దోపిడీ కేసులో అంతర్రాష్ట్ర ము ఠా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్ట్12న చందానగర్‌లోని ఖజానా జువెల్లరీలోకి తుపాకులతో చొరబడిన దొంగలు పదికిలోల వెండి ఆభరణాలు దోచుకున్నారు. నిందితులు బీహార్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
2024 జనవరి 31న దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలిని దారుణంగా చంపిన బీహారీ గ్యాంగ్ రూ.కోటి విలువైన సొత్తు, నగదు దోచుకుపోయింది. 2025 ఫిబ్రవరి 11న నారాయణగూడ పీఎస్ పరిధిలో కేడియా ఆయిల్స్ అధినేత ఇంటిని కొల్లగొట్టిన బిహారీ ముఠా రూ.40కోట్ల సొత్తు, నగదు ఎత్తుకుపోయింది.
బీహార్‌లోని మధుబని జిల్లా బిరోల్‌కు చెందిన మహేశ్‌కుమార్ మోఖియా, మోల్హు ముఖియాలు దోమలగూడలో వృద్ధురాలిని హత్య చేశారు. ఆ తర్వాత ఎనిమిది నెలలకు మహేశ్ పోలీసులకు చిక్కినా మోల్హూ మాత్రం పరారీలో ఉన్నాడు. నారాయణగూడ కేసులో సుశీల్ముఖియా, బసంతిలతో కలిసి హిమాయత్‌నగర్‌లోని ఇదే ముఠా కేడియా ఇంటిని కొల్లగొట్టారు. నగర కమిషనరేట్ పరిధిలో మధ్య సెంట్రల్, ఈస్ట్ జోన్లలోని వేర్వేరు పోలీస్స్టేషన్లలో, వేర్వేరు సమయాల్లో నమోదైన ఈ రెండు కేసుల్లో బీహారీలే నిదితులుగా ఉన్నారు. బీహార్‌కు చెందిన ఓ కీలక నిందితుడు ఈ రెండు కేసుల్లో ఉన్నాడు.
అఫ్జల్‌గంజ్‌లో గత జనవరిలో జరిగిన కాల్పుల ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. బీదర్‌లో దోపిడీ చేసి అక్కడ ఇద్దరిపై కాల్పులు జరిపి నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో ట్రావెల్స్ మేనేజర్‌పై కాల్పులు జరిపింది బీహార్‌లోని వైశాలి జిల్లా ఫతేపూర్ పుల్వారియాకు చెందిన అమన్‌కుమార్, అలోక్కుమార్లని పోలీసులు చెప్పారు. కర్ణాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో తుపాకులతో విరుచుకుపడిన ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరితో కలిసి గ్యాంగ్‌గా దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారని, ఇప్పటివరకు వారి ఆచూకీ దొరకలేదని పోలీసులు చెప్పారు.
ఆగస్టు నెలలో హైదరాబాద్‌లో గన్స్ విక్రయానికి ప్రయత్నిస్తున్న బీహార్‌కు చెందిన శివకుమార్‌ను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసి మూడు కంట్రీమేడ్ పిస్టోళ్లను స్వాధీనం చేసుకున్నారు. బీహార్‌లోని ఔరంగబాద్, పథాన్వన్ ప్రాంతానికి చెందిన శివ్‌కుమార్ తన బావ అయిన కృష్ణ పశ్వాన్తో కలిసి ఈజీగా మనీ సంపాదించేందుకు హైదరాబాద్‌లో ఆయుధాలు విక్రయించాలని ఫ్లాన్ చేశారు. కృష్ణ పశ్వాన్ బీహార్‌లో అక్రమాయుధాలను తయారు చేస్తూ మూడు కంట్రీ మేడ్ తుపాకులు, 10 లైవ్ రౌండ్స్ బుల్లెట్లు హైదరాబాద్‌లో విక్రయించే పనిని శివ్కుమార్కు అప్పగించాడు. బీహార్ నుంచి హైదరాబాద్‌కు రైల్లో వచ్చి, వాటిని చర్లపల్లి పరిసరాల్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది మే నెలలో బాలాపూర్ ప్రాంతంలో నివాసముంటున్న ఉత్తర్‌ప్రదేశ్, రాంపుర్ సిటీకి చెందిన మహ్మద్ జీషాన్ అలియాస్ జీఖాన్, మహ్మద్ అమీర్లు తమ వద్ద ఉన్న కంట్రీమేడ్ పిస్టోల్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఐదు కంట్రీమేడ్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఏడాది జనవరిలో జవహర్‌నగర్ పోలీసులు, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన అపరేషన్‌లో ఆక్రమాయుధాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హరే కృష్ణయాదవ్‌ను అరెస్ట్ చేసి మూడు కంట్రీ మేడ్ పిస్టోల్స్, 10 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.