సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ఒడిశా, ఏపీ నుంచి భారీ ఎత్తున గంజాయిని ఇతర రాష్ర్టాలకు హైదరాబాద్ మీదుగా తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాలను అణిచివేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకుంటున్న పోలీసులు, గంజాయి అమ్మిన వాళ్లను, కొంటున్న వాళ్లను మాత్రం పట్టుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రవాణా చేస్తున్న వాళ్లు అప్పుడప్పుడు పోలీసులకు పట్టుబడుతున్నారు, పట్టుబడకుండా రవాణా చేస్తున్న వాళ్లెందరు ఉంటారు, పట్టుబడ్డ వాళ్లే దొంగలు, పట్టుబడని వాళ్లు దొరలా తమ వ్యాపారాలను సాగిస్తున్నారు.
హైదరాబాద్ మీదుగా గంజాయి ఇతర రాష్ర్టాలకు సరఫరా కావడం ఒక ఎత్తు అయితే హైదరాబాద్‌కు, శివారు ప్రాంతాలకు కూడా సరఫరా అవుతుంది. ఔటర్ పరిసరాలలో రాచకొండ, సైబరాబాద్ పోలీసులకు అప్పుడప్పుడు గంజాయి రవాణా చేస్తున్న వాహనాలు పట్టుబడుతున్నాయి. తాజాగా రాచకొండ పోలీసులు ఒడిశా నుంచి రాజస్థాన్‌కు హైదరాబాద్ మీదుగా వెళ్తున్న రూ. 6.25 కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన అయూబ్‌ఖాన్ ఆ రాష్ట్రంలో గంజాయిని సరఫరా చేసే కింగ్‌పిన్‌గా ఉన్నాడు.
అతను ఇచ్చిన అసైన్మెంట్ మేరకు విక్రమ్ విష్ణోయ్ ఒడిశా నుంచి రాజస్థాన్‌కు 1210 కిలోల గంజాయిని తీసుకొని వెళ్తుండగా మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. సిమెంట్ సంచులు ట్రాలీలో వేసి వాటి మధ్యలో గంజాయి ప్యాకెట్లను దాచి ఎవరి సహాయం లేకుండా ఒంటరిగానే విక్రమ్ విష్ణోయ్ వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తున్నాడు. తన డీసీఎం వాహనంలో క్లీనర్‌ను కూడా పెట్టుకోలేదు, రెండో వ్యక్తి ఉంటే సమాచారం లీక్ అయ్యే అవకాశాలుంటాయనే ఉద్దేశ్యంతో విక్రమ్ ఒంటరిగానే గంజాయి రవాణాకు ఒప్పందం చేసుకున్నాడు. అయితే పోలీసులకు అందిన సమాచారంతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొరికిపోయాడు.
రాజస్థాన్‌లో ఉండే గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్ కేవలం రవాణా చేసేందుకు డ్రైవర్లను నియమించుకుంటారు. గంజాయి విక్రయించే వాళ్లతో నేరుగా సంప్రదింపులు చేస్తూ ఆన్లైన్లోనే డబ్బును పంపిస్తున్నట్లు పోలీసులకు ప్రాధమికంగా సమాచారం అందింది. డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, కస్టడీలోకి తీసుకొని మరింత సమాచారాన్ని రాబట్టనున్నారు.
అయితే గంజాయి ట్రాన్స్‌పోర్టుకు కాంట్రాక్టు ఇచ్చే ప్రధాన స్మగ్లింగ్ ముఠాకు డ్రైవర్ పట్టుబడ్డానే సమాచారం అందడంతోనే తమ అడ్డాలను మార్చేస్తుంటారని పోలీసులు చెబుతున్నారు. మరో చోట నుంచి మరో డ్రైవర్‌ను, మరో వాహనాన్ని ఇచ్చి కొత్త కాంట్రాక్టులు అప్పగిస్తుంటారని, అయితే అది ఇదే రూట్లో వెళ్లేలా కాకుండా, మరో మార్గంలో వెళ్లేలా ఫ్లాన్ చేసుకొని గంజాయి రవాణా చేస్తుంటారని సమాచారం.
గత కొంత కాలంగా జంట కమిషనరేట్లకు చెందిన ఎస్ఓటీ పోలీసులు కోట్లాది రూపాయల విలువైన గంజాయి అక్రమ రవాణాను అట్టుకున్నారు. నిందితులను పట్టుకున్నారు. అయితే ఇక్కడ కీలకమైన నిందితులను మాత్రం పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ దొరికిన దొంగలు, దొరికిన గంజాయితోనే ఆ కేసును మూసేస్తున్నారు. దీంతోనే అమ్మే వాళ్లు, కొనేవాళ్లు యధేచ్చగా తమ దందాలను సాగిస్తున్నారు.
అమ్మేవాళ్లు, కొనేవాళ్ల వరకు ఒకటి రెండు సార్లు వెళ్లే మూలాలను ఛేదిస్తే స్మగ్లర్లలో భయం పుట్టుకొస్తుంది. ఇలాంటి ముఠాలను పట్టుకున్నప్పుడే గంజాయి విక్రయాలు, అమ్మకాలను అడ్డుకోవడానికి వీలవుతుంది. ఇక్కడి నుంచి రవాణా జరగకుండా అడ్డుకోవడం, భారీగా గంజాయి స్వాధీనం చేసుకోవడంతో కొంత మేర గంజాయి వాడకాన్ని కట్టడి చేసేందుకు అవకాశమున్నా, పూర్తిస్తాయిలో కట్టడి చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.