కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 22: విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి సులువుగా డబ్బు సంపాందించాలనే ఆశతో చెవిటి..మూగలా నటిస్తూ నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠా పోలీసులకు చిక్కింది. సీసీఎస్ మాదాపూర్ , కేపీహెచ్‌బీ పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. శుక్రవారం షాపూర్‌లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. తమిళనాడు వెల్లూరు జిల్లాకు చెందిన జి.వడివేలు(27), మరియప్పన్ అన్నియప్పన్(28), సత్తివేలు(23), సత్యరాజ్(20)లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్ల దొంగతనాలు చేయాలనుకున్నారు. నగరానికి వచ్చి పటాన్చెరులో అద్దెకు ఉంటున్నారు.
అనాథ చారిటీ హైస్కూల్, కేరళ పేరిటా కరపత్రాలను ముద్రించి పలు ప్రాంతాల్లో ఉన్న హాస్టల్స్, బ్యాచ్లర్స్ రూంలను టార్గెట్ చేసి వారికిచ్చి ఆర్థిక సహాయాన్ని వసూలు చేస్తుంటారు. ఈ క్రమంలో బ్యాచిలర్స్ రూం తాళాలు ఆయా ఇంటి పరిసర ప్రాంతాలను గమనిస్తారు. వారు లేని సమయంలో రూమ్‌కు వచ్చి ల్యాప్‌టాప్‌లను అపహరిస్తున్నారు. దీంతో పాటు హాస్టల్స్, ఆసుపత్రిలతో పాటు వివిధ సంస్థల్లో ప్రవేశించి గుట్టుచప్పుడు కాకుండా విలువైన వస్తువులను తస్కరిస్తూ వాటిని తక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 2019 నుంచి 2023 వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వీరిపై 105 కేసులు నమోదయ్యాయి. నిందితుల వద్ద రూ.5 లక్షల నగదుతో పాటు రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
ప్రధాన నిందితుడు వడివేలు గతంలో అనుమానాస్పద స్థితిలో సీసీఎస్ పోలీసులకు పట్టుబడ్డాడు. మూగవాడిలా నటించడంతో పోలీసులు నమ్మారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఫోన్లో మాట్లాడుతుండగా ఓ కానిస్టేబుల్ గుర్తించి వీడియో రికార్డు చేసి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అతడిని చూసి అవాక్కైన పోలీసులు నిందితుడిని పూర్తిస్థాయిలో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. కేసును చాకచక్యంగా చేజించిన సీసీఎస్, కేపీహెచ్‌బీ పోలీసులను అభినందించారు. ఈ సమావేశంలో సీసీఎస్ అడిషనల్ డీసీపీ నర్సింహా రెడ్డి, ఏసీపీ శశాంత్రెడ్డి, కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.