ఖైరతాబాద్, మార్చి 5 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా మణులు చీరకట్టి.. తళుక్కున మెరిసిపోయారు. భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేసిన ‘వన్ భారత్ సారీ వాకథాన్’ను కేంద్ర రైల్వే, టెక్స్టైల్స్ మంత్రి దర్శన జర్దోష్, కేంద్ర పర్యాటక, సాంస్కృతి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రారంభించారు. వందలాది మంది మహిళలు చీర ధరించి ఈ వాక్‌లో పాల్గొని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనంద్ శంకర్, నారాయణ విద్యాసంస్థల చైర్మన్ శ్రీవిద్య, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిషన్ డాక్టర్ వీణా, ఎన్‌హెచ్‌డీసీ ఎండీ రీటా, బిగ్‌బాస్ ఫేమ్ దివ్య, మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు నృత్యప్రదర్శనలో అలరించారు.