Hyderabad | సైదాబాద్, ఏప్రిల్ 5 : వృద్ధాప్య మహిళలను ఆర్టీసీ బస్సుల్లో దృష్టి మళ్లించి బంగారు ఆభరణాలను తస్కరించే అంతర్ రాష్ట్ర మహిళ ముఠా సభ్యులను మాదన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలో చేసిన పలు నేరాలతో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మాదన్నపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన మున్నియండి రమ్య (27), తిరువూరుకు చెందిన భువనేశ్వర్ మీనా (30), ఇలప్పయార్కు చెందిన మూతి మారి(30), పరారీలో ఉన్న అంజలి, పార్వతిలు ఒక ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా నేరాలకు పాల్పడుతున్నారు. సరూర్ నగర్, కంచన్ బాగ్, మాదన్నపేట, బేగంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు నేరాలకు పాల్పడ్డారు. మీర్పేట ద్వారకామాయీ కాలనీలో నివసించే సుబ్బ లక్ష్మమ్మ (74) అనే వృద్ధురాలు మార్చి 25వ తేదీన ఎస్బీఐ బ్యాంకులో డబ్బులు తీసుకోవడానికి కంచన్బాగ్కు వచ్చారు. బ్యాంకులో 10 వేల రూపాయలను తీసుకొని తన ఇంటికి వెళ్లడానికి పిసల్ బండ బస్టాండులో బస్ కోసం ఎదురుచూస్తుండగా ఈ మహిళ ముఠా సభ్యులు వృద్ధురాలు వద్దకు వచ్చి ఆమెతో మాటలు కలిపారు. ఎక్కడికి వెళుతున్నావ్.. ఏ బస్సులో వెళ్ళాలి అనే వివరాలను వృద్ధురాలు నుంచి అడిగి అప్పుడే వచ్చిన కోఠికి
వెళ్లే బస్సులోకి ఎక్కించారు.
ముఠా సభ్యులు కూడా అదే బస్సులో ఎక్కే క్రమంలో సుబ్బ లక్ష్మమ్మను మాటల్లో దింపి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసు తస్కరించుకొని బస్సు దిగి వెళ్ళిపోయారు. మాదన్న పేటలో వృద్ధురాలు బస్సు దిగిన తర్వాత మెడలో బంగారు గొలుసు కనిపించక పోవటంతో ఆందోళన చెందిన ఆమె మాదన్న పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతోపాటు మూతులకు గుడ్డలు కట్టుకుని ఎక్కిన మహిళల పట్ల అనుమానం ఉందని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మాదన్నపేట్ పోలీసులు సిసి కెమెరాల సహాయంతో గాలించగా ముగ్గురు నిందితురాళ్లను శనివారం అరెస్ట్ చేశారు. 9 తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయలు నగదు స్వాధీన పరుచుకున్నామని, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.