Ganja | హైదరాబాద్ : గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితులను తెలంగాణకు చెందిన ఈగల్(Elite Action Group for Drug Law Enforcement) టీమ్ అరెస్టు చేసింది. ఒడిశా నుంచి ఉత్తరప్రదేశ్‌కు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఈగల్ టీమ్ తెలిపింది. వీరిద్దరి నుంచి 847 కేజీల గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లు, బొలెరో వెహికల్, ఒక తల్వార్‌ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ. 4.2 కోట్లు ఉంటుందని తెలిపారు.
పట్టుబడ్డ ఇద్దరు నిందితులు కూడా ఒడిశాకు చెందిన వారు కాగా, గంజాయి తరలిస్తున్న బొలెరో వాహనం మాత్రం యూపీలో రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఒడిశా నుంచి యూపీకి గంజాయి తరలిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో ఈగల్ టీమ్ అప్రమత్తమైంది. ఇక శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి వద్ద గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారు. 26 బ్యాగుల్లో 411 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.