Insulin | సిటీబ్యూరో, జూలై15 (నమస్తే తెలంగాణ): పేరు గొప్ప..ఊరు దిబ్బ.. అన్నట్లుగా ఉంది ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి. నగరంలోని పెద్ద దవాఖానాలకు ఇన్సులిన్ కొరత వెంటాడుతోంది. సర్కార్ దావఖానాల్లో ఇన్స్‌లిన్ లేదంటూ నో స్టాక్ బోర్డు పెట్టడంతో మధుమేహ బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేదిలేక ఆర్థికభారం అయినప్పటికీ ప్రైవేట్‌ను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మధుమేహ బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. వారిలో ఇన్సులిన్ తీసుకుంటే తప్ప రోజు గడవని వారు అనేకమంది ఉన్నారు. మధుమేహం అదుపులో పెట్టుకునేందుకు మందుల దశనుంచి ఇన్సులిన్ దశకు చేరినవారు అనేకమంది ఉన్నారు. అలాంటి వారంతా ప్రభుత్వాస్పత్రుల్లో నగరంలోని ఉస్మానియా, గాంధీ దావఖానల్లో ఉచితంగా ఇచ్చే ఇన్సులిన్ కోసం ప్రతిరోజు క్యూలు కడుతుంటారు. నోస్టాక్ బోర్డులు పెడుతున్న దవాఖానాలు..
గాంధీ, ఉస్మానియాకు ప్రతిరోజు సుమారుగా 300 మంది మధుమేహ బాధితులు ఇన్స్‌లిన్ కోసం వస్తుంటారు. కాగా కొన్ని రోజుల నుంచి గాంధీ, ఉస్మానియాలో ఇన్సులిన్ స్టాక్ అయిపోవడంతో మధుమేహ బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా ఆస్పుత్రుల కౌంటర్ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో చేసేది లేక బాధితులు సొంతడబ్బు ఖర్చుపెట్టుకొని ప్రైవేట్ మెడికల్ షాపుల్లో ఇన్సులిన్ కొనుగోలు చేసుకుంటున్నారు. కేవలం ఇన్స్‌లిన్ మాత్రమే కాకుండా అరుదైన శస్త్రచికిత్సలు చేసినప్పుడు వాడాల్సిన మందులు సైతం ప్రభుత్వాస్పత్రుల్లోని ఫార్మసీల్లో అందుబాటులో ఉండటం లేదనే విమర్శలున్నాయి. గత బీఆర్ఎస్ పాలనలో పీహెచ్‌సీల నుంచి మొదలు పెద్దాసుపత్రుల వరకు మందుల కొరత లేకుండా అప్పటి ఆరోగ్యశాఖ మంత్రులు తక్షణ చర్యలు చేపట్టేవారు. రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించడంలో అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచేసేవారు. అయితే పేదలకు ఉచిత, నాణ్యమైన వైద్యమందిస్తున్నామని గొప్పలు చెప్పే కాంగ్రెస్ సర్కార్ మందుల కొరత అధిగమించడంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.