సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్‌లో విస్తరించిన ఔటర్ రింగు రోడ్డు సర్వీసు రోడ్లపై కొత్తగా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ చర్యలు చేపట్టింది. గచ్చిబౌలి నుంచి ప్రారంభమయ్యే ఓఆర్ఆర్ చుట్టు పక్కల అభివృద్ధి శరవేగంగా చోటు చేసుకోవడంతో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఓఆర్ఆర్ సర్వీసు రోడ్లను రెండు మార్గాల్లో 24 కి.మీ మేర 4వరసలతో రోడ్డును విస్తరించే పనులు గతేడాది చేపట్టింది. ప్రస్తుతం ఆ పనులు చివరి దశకు చేరుకోవడంతో మళ్లీ విస్తరించిన సర్వీసు రోడ్ల వెంబడి అత్యాధునిక ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకోసం సుమారు రూ.9 కోట్ల వ్యయంతో నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు ఒక వైపు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు రెండు వైపులా అత్యాధునిక ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఐటీ కారిడార్‌లోని నానక్‌రాంగూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్, నార్సింగి, పుప్పాల్‌గూడ, కోకాపేట, మంచిరేవుల ప్రాంతాల్లో ఐటీ కంపెనీల కార్యాలయాలతో పాటు, పెద్ద ఎత్తున నివాస ప్రాంతాలు వచ్చాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని ఔటర్ రింగు రోడ్డు నుంచి శంషాబాద్ విమానాశ్రయం వైపు, ఇటు పటాన్చెరువు వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ ప్రధాన రహదారితో పాటు సర్వీసు రోడ్లు కీలకంగా మారడంతో వాటిని హెచ్ఎండీఏ విస్తరించే పనులు చేపట్టి పూర్తి చేస్తున్నది.