కాచిగూడ, జనవరి 21: సైబర్ నేరగాళ్లు కొత్త తరహ నేరాలకు పాల్పడుతున్నారని, వారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కాచిగూడ ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ సూచించారు. సైబర్ నేరాలు, మహిళల భద్రతపై బర్కత్పుర శ్యామలాదేవి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాజశేఖర్ హాజరై మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు సరికొత్త రకం మోసాలకు పాల్పడున్నారని, విద్యుత్ బిల్లు కట్టలేదని, మీ ఫోన్కు ఓటీపీ వస్తుందని, అది తెలుసుకుని మీ బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తున్నారన్నారు.
బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని ప్రకటించుకునే మోసపూరితమైన యాప్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగం కోసం గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు చెల్లించాలని అడిగినా అది మోసపూరితమైనదని గుర్తించాలని సూచించారు. ఈజీగా డబ్బులు వస్తాయంటే ఎవరు నమ్మవద్దని, వారి మాటల వలలో పడితే ఆర్థికంగా ఎంతో నష్టపోతారని పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసినా.. మేసేజ్లు పంపినా 8712660540లో సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కృష్ణవేణి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.