సిటీబ్యూరో: నాంపల్లిలోని సైబర్‌క్రైమ్ బ్యూరోలో శనివారం ఏసీబీ దాడులు నిర్వహించింది. సైబర్‌నేరగాళ్ల ఆట కట్టించాల్సిన పోలీసే లంచం తీసుకుంటూ అడ్డంగా ఏసీబీ వలలో చిక్కారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బత్తుల మహేందర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సైబర్ మోసం కేసులో బాధితుడి కుటుంబసభ్యుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు ఓ వ్యక్తిని మహేందర్ రూ.9 లక్షలు డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. బాధితుడి నుంచి ఇప్పటికే రూ.5 లక్షలు నగదు గుట్టుచప్పుడు కాకుండా తీసుకున్నారు. మిగిలిన రూ.4 లక్షల కోసం బెదిరింపులకు పాల్పడినట్లు ఏసీబీకి ఆయనపై ఫిర్యాదు అందింది.
శనివారం ఇన్స్పెక్టర్ మహేందర్ మిగిలిన 4 లక్షల రూపాయల లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. అరెస్ట్ అనంతరం మహేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.13 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మహేందర్‌ను ఏసీబీ అధికారులు నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. సైబర్ నేరాలను అరికట్టే అత్యున్నత విభాగమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఏసీబీ రైడ్స్ జరగడంతో పోలీసుశాఖలో కలకలం మొదలైంది.