శేరిలింగంపల్లి, ఏప్రిల్ 6: ఇండ్ల మధ్య పొంగిపొర్లుతున్న మురుగు… భరించలేని దుర్వాసన…దోమలు, పందుల స్వైరవిహారం… అస్తవ్యస్తంగా పరిసరాలు…శంకుస్థాపనకే పరిమితమైన పనులు…పట్టించుకోని అధికారుల తీరుతో విసిగిపోయిన శేరిలింగంపల్లి నెహ్రునగర్ ప్రాంతానికి చెందిన స్థానికులు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వినూత్న నిరసన తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెహ్రునగర్‌లో మురుగు కాలువ శంకుస్థాపనకే పరిమితమై సంవత్సరాలు గడుస్తున్నా.. పనులు పూర్తిచేయకపోవడంతో ఇండ్ల మధ్యలో పొంగిపొర్లుతున్న మురుగునీటిలో స్థానిక ప్రజాప్రతినిదుల ఫొటోలతో ప్లకార్డులు ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన చేపట్టారు.
శంకుస్థాపన హంగామా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 28 నెలలు అవుతున్నది.. పనులు ఎప్పుడు మొదలు పెడతారు.. గాంధీ నువ్వు పార్టీ మారినవ్…మా బస్తీ పరిస్థితులు ఎప్పుడు మారేది అంటూ.. ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తూ సీఎం రెవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, రాగం నాగేందర్ యాదవ్ ఫొటోలతో ప్రత్యేకంగా ప్లకార్డులు రూపొందించారు. ఇండ్ల మధ్య పారుతున్న మురుగు, దుర్గంధభరితంగా పరిసరాలకు అద్దంపడుతూ..వినూత్నంగా తెలిపిన నిరసన సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నది.
పనులు ప్రారంభం
నెహ్రునగర్ బస్తీ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి స్థానిక మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కంటితుడుపు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుండడంతో సోమవారం నెహ్రునగర్ బస్తీలో పర్యటించి సమస్యను పరిశీలించారు. డ్రైనేజీ పనుల నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు స్థానికులకు తెలిపారు.
ప్రజా సమస్యలు ప్రశ్నిస్తే కేసులా…
నెహ్రూనగర్‌లో ఇండ్ల మధ్య పొంగుతున్న డ్రైనేజీ సమస్యపై బస్తీవాసులతో కలిసి ప్రశ్నిస్తే అక్రమంగా తమపై కేసులు పెడుతున్నారు. ఎమ్మెల్యే గాంధీ పార్టీ మార్పును ప్రశ్నించడం, డ్రైనేజీ సమస్య పరిష్కరించకపోవడంతో నిలదీయడం, ప్రజా సమస్యలు లెవనెత్తితే కేసులు పెడతారా. ప్రజా సౌకర్యాల గురించి మాట్లాడవద్దా. కేసులకు భయపడే ప్రసక్తేలేదు. ప్రజా సమస్యలపై పోరాటం అపేది లేదు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ప్రజాసామ్యనికే ముప్పు.
– మారబోయిన రవియాదవ్, బీఆర్ఎస్ శేరిలింగంపల్లి నాయకుడు