కేపీహెచ్బీ కాలనీ, మే 30 : కాంగ్రెస్ పార్టీ నాయకులు.. వేధింపులతో అమాయకులను బలి తీసుకోవడం అత్యంత దారుణమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వచ్చిందంటే చాలు ప్రజావాణిలో కాంగ్రెస్ నేతలే బిల్డర్లపై ఫిర్యాదులిచ్చి వాళ్లే డబ్బులు వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. శుక్రవారం కూకట్ పల్లి క్యాంప్ కార్యాలయంలో డివిజన్ల కార్పొరేటర్లతో ఎమ్మెల్యే కృష్ణారావు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బోరబండ డివిజన్ బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ను కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ బాబా ఫసియోద్దీన్ బలి తీసుకోవడం ఎంతో కలిచివేసిందని చెప్పారు. కాంగ్రెస్ నేతలు గత కొన్ని నెలలుగా సర్దార్ను పలు రకాలుగా వేధిస్తున్నారని, అన్ని వైపులా వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నర ఏళ్ల వయసున్న సర్దార్ పిల్లలు, భార్య అనాథగా మారడం బాధాకరమన్నారు.
అమాయకులను వేధిస్తూ రాక్షసుల్లా పీడిస్తున్న ఇలాంటి నాయకులను క్షమించరాదని ప్రజలు కూడా వీరి అరాచకాలను గమనిస్తున్నారని చెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చిన్న, మధ్య తరగతి కుటుంబాలు ఇండ్లు కట్టుకుంటే స్వాగతించామని… కానీ ఈ రోజుల్లో సోమవారం వచ్చిందంటే చాలు ప్రజావాణికి కాంగ్రెస్ పార్టీ నాయకులే వెళ్లి బిల్డింగులపై ఫిర్యాదులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ నిర్మాణదారుల వద్ద డబ్బులు దండుకోవడం చేస్తున్నారని మండిపడ్డారు.