సిటీ బ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో వాయు కాలుష్యం పెరగటానికి పరిశ్రమలకు ఎలాంటి సంబంధం లేదని నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ) క్లీన్ చిట్ ఇచ్చేసింది. పీఎం-10, పీఎం- 2.5 ధూళి కణాలతో పాటు ఇతర కాలుష్య కారకాలు వాహనాలు, రోడ్లు, భవన నిర్మాణాల నుంచే వెలువడుతున్నట్లు తేల్చేసింది. ఎన్సీఏపీ ఆధ్వర్యంలో ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాలుష్యంపై అధ్యయనం చేశారు.
అధ్యయనం అనంతరం వెలువరించిన నివేదికల్లో కాలుష్యానికి పరిశ్రమలు కారణమే కాదని తేల్చారు. ఎండాకాలంలో దుమ్ము, గుంతల రోడ్లే వాయు కాలుష్యానికి కారణాలని, శీతాకాలంలో వాహనాల నుంచి వెలువడే పొగ ఎకువ కాలుష్యానికి కారణమవుతోందని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న పరిశ్రమల నుంచి 4 శాతం నుంచి గరిష్ఠంగా 6 శాతం మాత్రమే కాలుష్య కారకాలు వెలువడుతున్నాయని తేల్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 4 వేలకు పైగా ఉన్న పరిశ్రమలను ‘రెడ్ కేటగిరీ’ కింద ఎందుకు చేర్చినట్లు?. ఎన్సీఏపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఐటీ కాన్పూర్ నివేదికలపై పర్యావరణవేత్తలు, నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రెడ్ కేటగిరీ పరిశ్రమలను కాపాడేందుకే నివేదికను తమకు అనుకూలంగా ఇచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం వాహనాలు, రహదారులపైనున్న దుమ్ము వల్లనే వస్తుంటే గడిచిన ఆరేండ్లుగా ఎన్సీఏపీ ఖర్చు చేసిన రూ.550 కోట్లతో ఏం చేసినట్లు? రూ.కోట్లు ఖర్చు పెట్టినా హైదారాబాద్ రోడ్లు, వాహనాల నుంచి కాలుష్యాన్ని కట్టడి చేయలేకపోతున్నారా?.. కాలుష్యానికి కారణమవుతున్న వాటిని నియంత్రించేందుకు ఎన్సీఏపీ
ఇప్పటిదాకా ఖర్చు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4 వేలకు పైగా రెడ్ కేటగిరీ పరిశ్రమలున్నాయి. అంటే ప్రమాదకరమైన కాలుష్య కారకాలను వెజల్లుతాయి. ఈ పరిశ్రమల చుట్టూ దాదాపు ఒక కిలోమీటర్ దాకా దుర్వాసన వెదజల్లుతుంది. కానీ ఎన్సీఏపీ చేయించిన సర్వేలో మాత్రం పరిశ్రమల నుంచి కాలుష్య కారకాలు వెలువడటం నామమాత్రమేనని ధ్రువీకరించేశారు. పాశమైలారం, బొల్లారం, పటాన్చెరు, రామచంద్రాపురం, కూకట్పల్లి, చర్లపల్లి, మేడ్చల్, తదతర ప్రాంతాల్లో వేల సంఖ్యలో రెడ్కేటగిరి పరిశ్రమలు ఉన్నాయి.
వీటి నుంచి వచ్చే కాలుష్యం వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. దుర్వాసన, వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నామని నిత్యం ఏదో ఒక ప్రాంతం నుంచి కాలుష్య నియంత్రణ మండలిలో ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. కానీ ఐఐటీ కాన్పూర్ నిపుణులు పరిశ్రమల కాలుష్యం తక్కువేనని ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటో అంతుపట్టడం లేదు. ఆయా పరిశ్రమల నుంచి వాయు కాలుష్యం లేనపుడు రెడ్ కేటగిరీలో ఎందుకు పెట్టినట్లు? హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ బయటకు తరలించేందుకు ప్రభుత్వం హిల్ట్ పాలసీని ఎందుకు తెచ్చినట్లు? అని పర్యావరణవేత్తలు నిలదీస్తున్నారు.
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఐఐటీ కాన్పూర్ అధ్యయనం చేసి విడుదల చేసిన నివేదికపై పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నివేదిక వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో వాయు కాలుష్య నివారణ, ఎయిర్ క్వాలిటీ మెరుగు పరచడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రొగ్రాం(ఎన్సీఏపీ)కి భారీగా నిధులు కేటాయించింది. ఐదేండ్లలో కనీసం 40 శాతం వాయు నాణ్యత పెంచాలని లక్ష్యంగా నిర్ణయించింది. 2019 నుంచి నగరంలో ఎన్సీఏపీ అమలవుతున్నది.
దాదాపు రూ.550 కోట్లకు పైగా నిధులు జీహెచ్ఎంసీ సహా పలు ప్రభుత్వ శాఖల ద్వారా గాలి నాణ్యతను పెంపొందించేందుకు ఖర్చు చేసింది కానీ గాలి నాణ్యత క్షీణిస్తుందే తప్ప మెరుగుపడిన దాఖలాలు లేవు. తాజా అదే ఎన్సీఏపీ సమక్షంలో ఐఐటీ కాన్పూర్ చేపట్టిన అధ్యయనం దాని పనితీరును ప్రశ్నిస్తున్నది. శీతాకాలం, వేసవి కాలం రెండు భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో గాలి నాణ్యతా ప్రమాణాలను లెకించారు. వేసవిలో పీఎం 10లో మట్టి, రోడ్లపై ఉన్న దుమ్ము 41 శాతం, పీఎం 2.5 ధూళి కణాలు 31.7 శాతం వాయు కాలుష్యానికి కారణాలుగా తేల్చారు. శీతాకాలంలో వాహనాల నుంచి వెలువడే కాలుష్యం 25 శాతం నుంచి 28 శాతంగా నమోదైంది. సెకెండ్రీ ఇనార్గానిక్ ఏరోసెల్స్ (ఎస్ఓ2, అమ్మోనియా, ఇతర రసాయనాలు) శాతం మూడో స్థానంలో ఉన్నది. శీతాకాలంలో గాలిలో 23 శాతం వరకు ఈ రకమైన కెమికల్ కణాలు ఉంటున్నాయి. వేసవి కాలంలో వీటి సాంద్రత తగ్గుతున్నది.