మేడ్చల్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మాదారం ఇండస్ట్రియల్ పార్క్ (పారిశ్రామికవాడ) ప్రారంభానికి నోచుకోవడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పార్క్ ఏర్పాటుకు రూ. 60 కోట్ల నిధులు వెచ్చించి 186 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిని రెవెన్యూ అధికారులు టీఎస్ఐఐసీకి అప్పగించి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు లైన్ క్లియర్ చేశారు. కానీ, ఇండస్ట్రియల్ పార్క్ పనుల ప్రారంభంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. టీఎస్ఐఐసీకి భూమి కేటాయించిన క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. అయితే, అభివృద్ధి పనుల ప్రారంభం పై తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు.
పర్యావరణ రహిత పరిశ్రమలు..
మాదారంలో ఇండస్ట్రియల్ పార్క్లో వందలాది సంఖ్యలో పర్యావరణ రహిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. టీఎస్ఐఐసీ లే అవుట్ చేసి అన్ని సౌకర్యాలను కల్పించి పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకున్న వారికి కేటాయించేలా చర్యలు తీసుకుంటారు. అయితే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదు. పరిశ్రమల ఏర్పాటుకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అనుకూలంగా ఉన్న క్రమంలో వేలాది సంఖ్యలో పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. మాదారంలో ఇండస్ట్రియల్ పార్క్ పనులు పూర్తయితే భారీ, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు 250 వరకు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. అలాగే, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికైనా ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి పనులపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.