Indira Priyadarshini | తెలుగు యూనివర్సిటీ, మార్చి 21 : సంగీత, సాహిత్య కార్యక్రమాలు, పాఠశాలలు, కళాశాలల వార్షికోత్సవాలు, ప్రభుత్వ , ప్రయివేట్ సంస్థల సభలు, కులసంఘాల సదస్సులతో నిత్యం కళలాడే ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం గత కొన్ని సంవత్సరాలుగా ముగబోయింది. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్ ఆవరణలో అహ్లాదకరమైన వాతావరణంలో సువిశాలమైన స్థలంలో సుమారు మూడు దశాబ్ధాల క్రితం నిర్మించిన ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం ఆధునీకీరణకు నోచుకోక కళా విహీనంగా తయారైంది.
ముఖ్యంగా ఆడిటోరియానికి విశాలమైన పార్కింగ్ స్థలం కలదు అందుకే ఇక్కడ కార్యక్రమాలను కొనసాగించేందుకు నిర్వహకులు ఆసక్తి చూపేవారు. గత కొంత కాలంగా తెరుచుకోకుండా ఉన్న ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం బూత్ బంగ్లాను తలపిస్తోంది. సాయంత్రం వేళ అటువెళ్ళాలంటేనే గార్డెన్ సందర్శకులు బయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అంతేగాకుండా పబ్లిక్‌గార్డెన్ సంచరించే కొందరు పోకిరీలు, ఆకతాయిలు ఆడిటోరియం పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చుని తమ కార్యకలాపాలను కొనసగిస్తున్నారు. ఆడిటోరియం చుట్టూ చెత్త చెదారంతో నిండిపోయి డంపింగ్ యార్డును తలపిస్తోంది.
పబ్లిక్ గార్డెన్ సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచిన ఆడిటోరియం
పబ్లిక్ గార్డెన్‌కు సాయంత్రం వేళ సేదతీరేందుకు హిమాయత్‌నగర్, ఆబిడ్స్, గన్‌ఫౌండ్రి, ఆదర్శనగర్, ఖైరతాబాద్, నాంపల్లి, సైఫాబాద్, కోఠి తదితర ప్రాంతాలనుండి కుటుంబ సభ్యులతో వచ్చే ప్రజలు, మిత్ర బృందంతో ఇక్కడ కలిసే వృద్దులు, ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలలో పనిచేసే వారు అనేకులు నిత్యం వందలాదిగా ఇక్కడికి వచ్చి గార్డెన్ పచ్చిక బయళ్ళపై కాలక్షైపం చేసి ఆడిటోరియంలో జరిగే కార్యక్రమాలను వీక్షించి మానసిక ఉల్లాసాన్ని పొందేవారు. ఆడిటోరియంలోకి ఉచిత ప్రవేశం ఉండడంతో ప్రజలు కార్యక్రమాల వీక్షణకు సుదూర ప్రంతాలనుండి వచ్చేవారు. ముఖ్యంగా పిల్లలు ఆటపాటలతో పాటు ఆడిటోరియంలో జరిగే కార్యక్రమాలను వీక్షించి విజ్ఞానాన్ని పొందేవారు.
సోయి లేని పాలకులు, అధికారులు…
శాసన సభకు, మండలికి సమీపంలోనే ఉన్న ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియాన్ని ఆధునీకీకరించి పూర్వ వైభవం తీసుకురావాలనే సోయి పాలకులకు గానీ విద్యాశాఖకు గానీ లేకపోవడం శోచనీయం. సంగీత, సాహిత్య కార్యక్రమాల నిర్వహణతో విరామం లేకుండా ఉండే రవీంధ్రభారతిలో ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాలే అధికంగా జరుగుతుండడం వల్ల సాహిత్య సంస్థల నిర్వహకులకు కార్యక్రమాలు జరుపుకోవడానికి అవకాశం దొరకడంలేదని వాపోతున్నారు. సుమారు ఐదు వందలకు పైగా సీటింగ్ సామర్థ్యం కలిగిన ఆడిటోరియానికి ఆధునీకీకరణ చేసి అందుబాటులోకి తీసువస్తే కార్యక్రమాల నిర్వహకులకు ఎంతో మేలు చేయవచ్చు. త ద్వారా బాలభవన్ కూడా ఆర్థికంగా బలోపేతం కావచ్చు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆడిటోరియం నిర్వహణలో భాగస్వాములవుతున్న పదిమంది ఉద్యోగులకు ఉపాధిని కలిపించవచ్చు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. బడ్జెట్ లేదని అంటున్నారు : బాలభవన్ డైరక్టర్ ఎస్ విజయలక్ష్మి
జవహార్ బాలభవన్ పర్యవేక్షణలో కొనసాగుతున్న ఆడిటోరియం ఆధునీకీకరణకు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా వారు స్పందించడంలేదని వాపోతున్నారు. కార్యక్రమాల నిర్వహణతో ఆడిటోరియంకు వచ్చే అద్దె సొమ్ముతో బాలభవన్ కూడా ఆర్థికంగా బలోపేతం చెందుతుంది. బడ్జెట్ లేదని అంటూ కాలం వెల్లదీస్తున్నారు. వాస్తవానికి నగరంలో ఏ ఆడిటోరియానికి లేని విశాలమైన ప్రాంగణంతో పాటు పార్కింగ్ స్థలం కూడా ఉంది. మరోసారి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆధునీకీకరించి అందుబాటులోకి తీసువచ్చేల కృషి చేస్తామని ఎస్ విజయలక్ష్మి పేర్కొన్నారు.