Cyber Crime | సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : సెక్సాటార్షన్, లోన్‌యాప్ వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ వేధింపులతో కొందరు డిప్రెషన్‌కు లోనుకావడం, మరికొందరు భయపడి సైబర్‌నేరగాళ్లకు డబ్బులు పంపించడం, మరికొందరు అవమానం భరించలేక ప్రాణాలు కూడా కోల్పోతున్నారని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ నమోదు కాగా, ఇటీవల ఈ మోసాలు నగర శివారు ప్రాంతాలకు వ్యాపించాయి. ఇలాంటి మోసాలపై ప్రతి రోజు ఒకటి నుంచి మూడు వరకు ఫిర్యాదులు అందుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. గత ఏడాది రాచకొండలో లోన్ యాప్‌లపై 75, సెక్సాటార్షన్ కేసులు 47 నమోదయ్యాయి.
మహిళతో నగ్నంగా వీడియోకాల్ మాట్లాడవని..
బాధితుడికి వాట్సాప్ నుంచి ఓ గుర్తుతెలియని మహిళ నగ్నంగా వీడియో కాల్ చేసింది. బాధితుడికి తెలియకుండా రికార్డు చేసి బ్లాక్‌మెయిలింగ్ చేయడం ప్రారంభించింది. తరువాత మరో నంబర్ నుంచి వాట్సాప్ కాల్ చేసి మేం పోలీసు అధికారులమని, మహిళ నగ్నంగా ఉన్న సమయంలో వీడియో కాల్ మాట్లాడావని నీపై ఫిర్యాదు వచ్చిందని, నీ మీద కేసు నమోదు చేస్తున్నామంటూ బెదిరించారు. కేసు లేకుండా చేయాలంటే ఫలానా నంబర్‌కు డబ్బులు పంపించాలంటూ రూ.3.74 లక్షలు వసూలు చేశారు. ఇంకా బ్లాక్మెయిల్ చేస్తుండడంతో బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహిళ ఫొటోను మార్పింగ్ చేసి
ఎలాంటి రుణం తీసుకోకుండానే ఓ మహిళను మార్ఫింగ్ ఫొటోతో సైబర్ నేరగాళ్లు వేధింపులకు గురిచేస్తున్నారు. బాధితురాలి ఫొటోను మార్ఫింగ్ చేసి మీరు రుణం తీసుకున్నారు, డెయిలీ క్యాష్ లోన్ యాప్ పేరుతో వేధింపులకు దిగడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బట్టలు విప్పించి.. వీడియో తీసి.!
ఓ గుర్తుతెలియని మహిళ బాధతుడికి వాట్సాప్ కాల్ చేసి మాట్లాడింది. ఆ తరువాత నగ్నంగా వీడియో కాల్ చేసే విధంగా రెచ్చగొట్టి వీడియో రికార్డు చేసింది. ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు ఇవ్వాలని లేదంటే నీ వీడియోను సోషల్‌మీడియోలో సర్క్యూలేట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగడంతో రూ.2.12 లక్షలు బాధితుడు సైబర్‌నేరగాళ్లకు పంపించాడు.
గుర్తుతెలియని యాప్‌లను డౌన్లోడ్ చేయవద్దు
సైబర్‌నేరగాళ్లు వివిధ రకాలుగా బ్లాక్‌మెయిలింగ్ చేస్తుంటారు. వేధింపులకు పాల్పడుతుంటారు. అలాంటి వాటికి భయపడవద్దు. గుర్తుతెలియని యాప్‌లు, ఇన్స్టంట్ లోన్‌యాప్‌లు డౌన్లోడ్ చేయవద్దు. యాప్‌లు డౌన్లోడ్ చేసే సమయంలోనే మన ఫోన్లో ఉండే కాంటాక్టు, ఫైల్స్, ఫొటో గ్యాలరీని యాక్సెస్ చేసుకోవాలని అడుగుతుంది. అనుమతులు ఇవ్వవద్దు. డేటింగ్ సైట్లు, గుర్తుతెలియని మహిళల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు సమాధానం ఇవ్వొద్దు. సోషల్‌మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయాలు వద్దు. ఏదైనా సైబర్‌నేరం జరిగితే వెంటనే 1930కు సమాచారం ఇవ్వండి, www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
– అనురాధ, రాచకొండ, సైబర్‌క్రైమ్స్ డీసీపీ,