Hyderabad | సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జంఝాటాలు లేని ప్రయాణం కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూపకల్పన చేసి ప్రారంభించిన ఎస్సార్టీపీ ఫలాలు ఒక్కొక్కటిగా ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా 23వ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.799.74కోట్లతో ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు ఆరు లేన్లతో119 ఫిల్లర్లతో 4.08 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్ పనులను చేపట్టగా చివరి దశ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం ద్వారా ఉప్పల్ నుంచి ఎల్బీనగర్, బైరామల్‌గూడ, ఓవైసీ ఫ్లై ఓవర్, అబ్ధుల్ కలాం ఫ్లై ఓవర్, చాంద్రాయణ గుట్ట ఫ్లై ఓవర్ మీదుగా జూపార్కు -ఆరాంఘర్ ఫ్లై ఓవర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు ప్రయాణం సాఫీగా సాగనుంది. ఆరాంఘర్, శాస్త్రిపురం, కాలాపత్తర్, దారుల్ ఉల్ం, శివరాంపల్లి, హసన్‌నగర్ జంక్షన్లకులో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత ఉపశమనం లభించనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగర అభివృద్దే తెలంగాణ అభివృద్ధి అని రోడ్ల విస్తరణ, మెట్రో నిర్మాణం, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపర్చాల్సి ఉందన్నారు.
ఈ సందర్భంగా ఆరాంఘర్-జూపార్క్ ఫ్లై ఓవర్‌కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని సూచిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. కాగా కేసీఆర్ ప్రభుత్వం ఎస్ఆర్డీపీ కింద జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన 42 ప్రాజెక్టుల్లో 36 ప్రాజెక్టులు అందుబాటులోకి రాగా, 37వ ప్రాజెక్టుగా ఆరాంఘర్ ఫ్లై ఓవర్ నిలించింది. తాజాగా ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, అనిల్‌కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.