Hyderabad | సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న జనాభా, జన సాంద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్న రోడ్ల పరిరక్షణ, లింకు రోడ్లకు వేర్వేరుగా ప్రణాళికలతో ప్రభుత్వం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నది. రూ. 2140 కోట్లతో హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్డీసీఎల్) లింకు రోడ్లను అభివృద్ధి చేస్తూ ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతోంది. తొలి విడుతలో రూ. 275.53 కోట్లు ఖర్చు చేసి 22 చోట్ల కలిపి 24.30 కిలోమీటర్ల మేర లింకు రోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
అత్యధికంగా వెస్ట్‌జోన్‌లో రాగా..కోర్ సిటీలో విడుతల వారీగా లింకు రోడ్లు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మాసబ్‌ట్యాంక్, ఎన్ఎండీసీ చౌరస్తాలో ట్రాఫిక్ జంక్షన్‌కు శాశ్వత విముక్తిగా లింకు రోడ్డు చేపట్టాలని జీహెచ్ఎంసీ ప్రతిపాదించారు. ఈ మేరకు మంగళవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ లింకు రోడ్డు విస్తరణను ఆమోదించనున్నారు. కాగా పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ నుంచి సరోజినీదేవి కంటి దవాఖాన ప్రధాన ద్వారం దాటి కొద్ది దూరం వెళ్లగానే ఎడమ వైపు ఉన్న రహదారిని అహ్మద్‌నగర్ ఫస్ట్‌లాన్సర్ రోడ్ మీదుగా బంజారాహిల్స్ రోడ్ నం 12 ఖాజా మెన్షన్ ఫంక్షన్ వరకు అనుసంధానం చేయనున్నారు.
New Link Road Map
దాదాపు కిలో మీటరన్నర దూరం ఉంటుంది. 18 మీటర్ల వెడల్పుతో కొత్త లింకు రోడ్డుగా విస్తరించనున్నారు. ఆర్డీపీ (రోడ్ డెవలప్మెంట్ ప్లాన్)లో భాగంగా ఈ మార్గంలో 178 ఆస్తులను గుర్తించారు. ఈ లింకు రోడ్డు అందుబాటులోకి వస్తే మెహిదీపట్నం, ఎయిర్‌పోర్టు నుంచి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే వైపు నుంచి వారు బంజారాహిల్స్ వైపు వెళ్లాలంటే సులభంగా చేరుకోవచ్చు. దీని వల్ల ఇప్పటికే సరోజినీదేవి కంటి దవాఖాననుంచి ఎన్ఎండీసీ చౌరస్తా, మాసబ్‌ట్యాంక్ చౌరస్తా ట్రాఫిక్ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.