సిటీబ్యూరో, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ): ఇలా దాదాపుగా అన్ని సైబర్ నేరాల్లో సైబర్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో అసలు సూత్రధారులు తప్పించుకుంటున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే 338 కేసులు.. 233 ఎఫ్ఐఆర్లు.. 14 రాష్ర్టాలకు చెందిన 61 మంది అరెస్ట్ కాగా.. వీరిలో అసలు నేరస్తులు, డబ్బులు దోచేసినవాళ్లు దొరకలేదు. ప్రతీ ఏడాది లక్షకు పైగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి.
ఇండియన్ బ్యాంక్ అకౌంట్లను ఇంటర్నేషనల్ సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. కొందరు ఏజెంట్ల సాయంతో అమాయకులకు డబ్బులు ఎరవేసి వారి అకౌంట్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఆన్లైన్ మోసాలతో కొట్టేసిన డబ్బులను మ్యూల్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకుని క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్స్ రూపంలోకి మార్చుకుంటున్నారు. ఇందుకోసం ఏజెంట్లతోపాటు ఖాతాదారులకు భారీగా కమీషన్లు ఇస్తున్నారు. ఇలాంటి మ్యూల్ అకౌంట్లను గుర్తించి ఖాతాదారులను, ఏజెంట్లను అరెస్ట్ చేస్తున్నారు తప్ప.. అసలు నేరస్తులను పట్టుకోలేకపోతున్నారు.
పోలీసులకు సవాల్..!
చాలా సందర్భాల్లో నేరగాళ్లు విదేశాల నుంచి అంటే కంబోడియా, మయన్మార్, థాయ్‌లాండ్ వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. అక్కడ నుంచి డమ్మీ సిమ్ల ద్వారా బాధితులను ట్రాప్ చేయడం, ఆ తర్వాత వారిపై ఏదో రకమైన ఒత్తిడి తీసుకొని రావడం, అంతకుముందే మన దేశానికి సంబంధించిన వారిని కమీషన్ పేరుతో ఆకర్షించి వారి ద్వారా బ్యాంక్ లావాదేవీలు కొనసాగించడం, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం వంటివి చేయడం వల్ల అసలు నేరస్తులు తప్పించుకుని బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన వారు, వాటిని కొనసాగించిన వారు పోలీసులకు చిక్కుతున్నారు.
ప్రతీ ఏటా పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో నైజీరియన్ గ్యాంగ్స్, చైనా సైబర్ నేరగాళ్ల పాత్రే ఎక్కువగా ఉంటున్నది. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, యూపీ,బీహార్, జార్ఖండ్‌లలో ఏజెంట్లను నియమించుకుని ఖాతాల దందా చేస్తున్నారు. గత ఏడాది కాలంగా ఏపీ, తెలంగాణల్లోనూ ఎక్కువగా ఈ తరహా ఖాతాలు పెరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, నేషనల్క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో దాదాపు 1.14 లక్షల ఫిర్యాదులు నమోదుకాగా, అందులో ట్రై కమిషనరేట్లే ముందు స్థానాల్లో ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం సుమారు 4వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనావేస్తున్నారు. ఇటీవల జరుగుతున్న నేరాలు చూస్తే దాదాపు కోటిరూపాయల పైన మోసపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం.