సిటీబ్యూరో, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ):నగరంలోని ప్రముఖులు ఉండే ప్రాంతంలోని ఓ బస్తీలో కరెంట్ బిల్లులు కట్టకపోవడంతో కరెంట్ కట్ చేస్తూ పోతున్నారు బిల్ కలెక్టర్లు. ఆ బస్తీలో కట్టాల్సిన బిల్లులు చూస్తే ఒక్కొక్కరిది రూ.590, రూ.620, రూ. 530.. ఇలా చెప్పుకొంటూ పోతే దాదాపు పదిహేను మందికి పైగా వెయ్యిలోపే బిల్లు కట్టాల్సి ఉంది. కానీ వాళ్లు బిల్లు కట్టలేదని కరెంట్ కట్ చేస్తుంటే రేపు లేదా ఎల్లుండి కడతామని ఆ ఇళ్లల్లో ఉన్న మహిళలు చెబుతున్నా వినకుండా కరెంట్ కట్ చేశారు బిల్ కలెక్టర్లు..!
నగరశివారులోని మేడ్చల్ పరిధిలోని ఓ పరిశ్రమ సుమారు రూ. 93 లక్షలు బాకీ పడ్డారు. గత కొన్నినెలలుగా వారు బిల్లు కట్టడం లేదు సరికదా ఎవరైనా బిల్లు కట్టాలని అడిగితే అధికారులను మేనేజ్ చేస్తున్నట్లు డిస్కంలో తెలిసింది. ఇటీవల బదిలీపై కొత్తగా వచ్చిన అధికారి బకాయిలపై దృష్టిపెట్టిన క్రమంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదికి పైగా కంపెనీల బిల్లులు కోట్ల రూపాయల్లోనే బకాయిలు పడ్డట్లు తేలింది. దీనిపై ఆయన లోతుగా ఆరా తీస్తే స్థానిక అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సహకరించడంతోనే బిల్లులు కట్టకుండా ఏదో ఒకసాకు చెబుతూ కంపెనీలు నడిపిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయన ఈ వ్యవహారాన్ని సీఎండీ దృష్టికి తీసుకుపోవాలని తనపై స్థాయి అధికారులతో చర్చించినట్లు సమాచారం.
దక్షిణ డిస్కంలో ఇటువంటి పరిస్థితి కొత్తేం కాకపోయినా అధికారుల బదిలీలతో మొండిబకాయిలు బయటపడుతున్నాయి. ప్రధానంగా సామాన్యులు కరెంట్ బిల్లు కట్టడం ఒక్కరోజు ఆలస్యమైనా కనెక్షన్ కట్ చేస్తున్న విద్యుత్ అధికారులు.. బడాబాబులు రూ.కోట్లలో కరెంట్ బిల్లు బకాయిపడ్డా వారి జోలికి వెళ్లడం లేదు. బకాయిపడ్డ రెండుమూడు నెలల్లోనే చిన్నచిన్న బస్తీలు, కాలనీల్లో కరెంట్సిబ్బంది హల్చల్ చేస్తూ వారి కనెక్షన్‌ను తొలగిస్తుంటే.. పారిశ్రామిక ప్రాంతాలు ప్రత్యేకించి హెచ్‌టి కనెక్షన్ల విషయంలో ఏళ్ల తరబడి బిల్లులు పేరుకుపోయినా పట్టించుకునేవారు లేదు.
హైదరాబాద్‌లో 1700 హైటెన్షన్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రంలో వాడే వ్యవసాయేతర విద్యుత్‌లో 70శాతం జంటనగరాల్లోనే వినియోగిస్తున్నారు. ఇందులోనూ బడాబాబుల చేతుల్లో ఉన్న సంస్థలే దాదాపు 50 శాతం విద్యుత్ వాడుతున్నాయి. పలు సంస్థలు కొన్నేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో ఇప్పుడు ఆ బకాయిలు దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్త పరిధిలోదాదాపు రూ.6 వందల కోట్లకు చేరాయి.ఇంకా స్పష్టంగా చెప్పాలంటే హైదరాబాద్ పరిధిలోని సుమారుగా 725 కనెక్షన్ల మొండిబకాయిలకు సంబంధించిన బకాయిలుగా విద్యుత్ అధికారులు చెప్పారు. బకాయి పడ్డ సంస్థలలో కార్పొరేట్ ఆసుపత్రులు, కోట్లలో వ్యాపారం చేసే టెలిసర్వీసెస్, కంఎనీలు, స్టార్‌హోటళ్లు, పెద్దపెద్ద రిసార్టులు.. ఇలా చాలాసంస్థలు ఉన్నాయి.
పాత కనెక్షన్ల బిల్లులు చాంతాడంత పెరిగితే వాటిని వదిలేసి కొత్త పేరుతో కొత్త కనెక్షన్లు తీసుకుంటూ పాత బాకీలు వదిలేస్తున్నారు. దీంతో బకాయిల గుట్ట రోజురోజుకూ పెరుగుతోంది. వీటికి స్థానిక అధికారులతో పాటు మింట్‌కాంపౌండ్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి కొందరు అధికారుల సహకారం ఉందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నగరశివారు ప్రాంతాలైన నెమలినగర్, గోపన్‌పల్లి, కోకాపేట, కోహెడ, తట్టిఅన్నారం, అబ్దుల్లాపూర్‌మెట్, మాన్సాన్పల్లి, అజీజ్‌నగర్, కందుకూరు, కే సింగారం, మల్లాపూర్, వాయుపురి, ఉప్పల్‌భగాయత్, దుండిగల్ వంటి ప్రాంతాల్లో హెచ్‌టీ కనెక్షన్లలో ఈ దందా కొనసాగుతోంది.