హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం బేగంబజార్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోషా మహల్ నియోజకవర్గ పరిధిలోని 274 మంది బీసీ కులవృత్తి దారులకు లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
కులవృత్తిదారులు మరింత అభివృద్ధి సాధించాలనే ఆలోచనతోనే ధరఖాస్తు చేసుకున్నారిలో అర్హులైన వారికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సహాయం కూడా ఒక్కో నియోజకవర్గ పరిధిలో 300 మంది చొప్పున ఎంపిక చేసి అందజేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, దశల వారీగా అర్హులైన వారందరికీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజా సింగ్, కార్పొరేటర్లు శంకర్ యాదవ్, రాకేశ్ జైశ్వాల్, సురేఖ, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఆశన్న, మాజీ కార్పొరేటర్లు మమతా గుప్తా, పరమేశ్వరి సింగ్, నాయకులు ఆనంద్ గౌడ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, ధన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.