సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో గ‘లీజు’ వ్యవహారం మరో చోట వెలుగులోకి వచ్చింది..బల్దియా ఆస్తులను అక్రమ పద్ధతిలో లీజుకు తీసుకుని దర్జాగా అనుభవిస్తున్నారు. ఏళ్ల తరబడి లీజు గడువు ముగిసిన వాటిని స్వాధీనం చేసుకోవడంలో ఎస్టేట్ విభాగం నిర్లక్ష్యాన్ని ఆసరా చేసుకుంటూ ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారీతిలో దందా చేస్తున్నారు. మార్కెట్లు, మున్సిపల్ దుకాణాలే కాదు పార్కులను సైతం అడ్డగోలు సంపాదనకు తెరలేపుతున్నారు. మూసాపేట సర్కిల్-23లోని బాలాజీ నగర్ డివిజన్లో ప్లే పార్కును ఓ ప్రైవేట్ వ్యక్తికి అప్పగించారు.
సదరు పార్కును డెవలప్మెంట్ చేసి వ్యక్తి అందులో ప్లేయింగ్ కోర్ట్ (ఎనిమిది రకాల క్రీడలు) ఏర్పాటు చేసి ఫీజులు పెట్టి నిర్వహణ చేపడుతున్నాడు. అంతేకాకుండా ఏటా బల్దియాకు రూ. 18 లక్షలు చెల్లిస్తున్నాడు. మూడేళ్ల పాటు సదరు వ్యక్తికి పార్కును లీజు ఇచ్చారు. స్టాండింగ్ కమిటీలో చర్చించి 2019 డిసెంబర్ 5న నిర్ణయం తీసుకున్నారు. ఐతే గడువు ముగిసిన నేటికీ ఎలా కొనసాగుతుందంటూ ఫిర్యాదులు రావడం వెనుక విచారణ చేపడితే స్టాండింగ్ కమిటీ ఆమోదం లేకుండానే మరో మూడేళ్ల పాటు ఆ వ్యక్తికి జోనల్ కమిషనర్ కట్టబెట్టారని తేలింది. దీంతో తక్షణమే ఈ తరహా ఎక్కడెక్కడ ఉన్నాయనే అంశంపై ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. అంతేకాకుండా జీహెచ్ఎంసీకి సంబంధించిన ఆస్తులు ఏవైనా సరే ఇక మీదట స్టాండింగ్ కమిటీలో చర్చించాకే తదుపరి కేటాయింపులు జరిగేలా తీర్మానం చేశారు. ఏడాది నుంచి మూడేళ్ల పాటు లీజు, నిర్వహణ ఏదైనా స్టాండింగ్ కమిటీకి ప్రతిపాదనలు పెట్టాలని కమిటీ సభ్యులు తీర్మానం చేశారు.
జీహెచ్ఎంసీ ఆస్తులను దశాబ్దాల క్రితం అద్దెకు తీసుకొని గడువు ముగిసినా, వాటిని ఖాళీ చేయకుండా ఇతరులకు అప్పగించకుండా అడ్డుపడుతున్న లీజుదారులు, వాటిని సబ్ లీజులకు ఇచ్చి లక్షల రూపాయలు అద్దెలు వసూలు చేసుకొని జీహెచ్ఎంసీకి కేవలం వేలల్లో మాత్రమే చెల్లిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 22 మార్కెట్లుండగా, వాటిలో 2152 స్టాళ్లు ఉన్నాయి. వెజిటేబుల్ మార్కెట్లు 5, నాన్ వెజ్ మార్కెట్లు 7 రెండు కలిపి 10 ఉన్నాయి. మున్సిపల్ కాంప్లెక్స్‌లు 19 ఉండగా యూని ట్లు 715 వరకు ఉండగా మోడల్ మార్కెట్లు 37 ఉండగా 589 షాపులు ఉన్నాయి. సుమారు రెండు దశాబ్దాల నుంచి అద్దెలు చెల్లించని వ్యాపారులు ఉన్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారే తప్ప వారిని ఖాళీ చేయించి కొత్త టెండర్ల ద్వారా ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి సారించడంలో ఎస్టేట్ విభాగం విఫలం చెందిందన్న ఆరోపణలు ఉన్నాయి.
గ్రేటర్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రార్ ఏర్పాటు చేసి దాని ప్రకారంగా కంప్యూటరైజ్ చేశారు. ఆస్తులకు సంబంధించిన లీజు పూర్తయిన, ఇంకా కొనసాగుతున్నట్లు వివరాలను సేకరించి వారందరికీ నోటీసులు జారీ చేసి వాటి వివరాలను అందులో పొందుపర్చాలని నిర్ణయించారు. లీజుకు తీసుకున్న వ్యక్తి వినియోగించుకుంటున్నారా లేదా ఇతరులు ఉపయోగించుకుంటున్నారా అని క్షేత్ర స్థాయిలో జోనల్ అసిస్టెంట్ ఎస్టేట్ అధికారులు విచారించి ఈ నివేదిక సిద్ధం చేయడంలో తాత్సారం చేస్తుండటం గమనార్హం.