సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): భారతదేశంలోకి అక్రమంగా చొరబడి, ఇక్కడ ఆధార్, పాస్‌పోర్టులను పొంది దర్జాగా వ్యాపారాలు చేసుకుంటున్న రోహింగ్యాలను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు కథనం ప్రకారం.. మహ్మద్ అర్మాన్ అలియాస్ సయ్యద్ యూఐ అమిన్, అతని భార్య మహ్మద్ రుమాన అక్తర్ అలియాస్ ముస్తఖిమా, సోదరుడు మహ్మద్ నహీమ్లతో పాటు మహ్మద్ హరీష్ అలియాస్ మహ్మద్ రిజ్వాన్‌లు 2011లో మయన్మార్ నుంచి భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డారు.
2014లో నకిలీ పత్రాలతో మంచాల్లోని మీ-సేవా కేంద్రం ద్వారా ఆధార్‌కార్డులు పొందారు. దాని ద్వారా ఇండియన్ పాస్‌పోర్టును సైతం సాధించారు. వీళ్ల సహకారంతో 2016లో అయాజ్, సోహెబ్ మాలిక్‌లు కూడా ఇండియాలోకి అక్రమంగా చొరబడి వచ్చారు. ఇటీవల రాచకొండ పోలీసులు అక్రమంగా నివాసముంటున్న విదేశీయులపై నిఘా పెట్టడంతో రోహింగ్యాల అక్రమ చొరబబాటు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ అదనపు డీసీపీ మహ్మద్ షకీర్ హుస్సేన్, ఎల్బీనగర్, మహేశ్వరం ఎస్ఓటీ సిబ్బంది, హయత్‌నగర్ పోలీసులతో కలిసి రోహింగ్యాలను అరెస్ట్ చేశారు.
వ్యాపారులుగా.. మదర్సా టీచర్లుగా..
ఇండియాలోకి అక్రమంగా చొరబడి వచ్చి ఇక్కడ అక్రమ పద్ధతిలో గుర్తింపుకార్డులు పొందిన మహ్మద్ అర్మాన్, రుమానా అక్తర్, మహ్మద్ నహీమ్లు అబ్దుల్లాపూర్ మండలంలోని పెద్దంబర్పేట ప్రాంతంలో నివాసముంటూ స్థానికంగా బ్యాటరీ దుకాణాలు నిర్వహిస్తున్నారు. మహ్మద్ హరీష్ హఫీజ్‌బాబానగర్‌లో నివాసముంటూ జమియాసరియా మదర్సాలో ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నలుగురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా రంగారెడ్డి జిల్లా మం చాల్ మండలంలోని అగాపల్లిలోని ఉన్న మోహిన్ ఉల్ ఉలూమ్ మదర్సాలో పనిచేస్తున్న అయాజ్, బాలాపూర్‌లో నివాసముంటున్న షోహెబ్ మాలిక్‌లు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి ఐదు ఆధార్‌కార్డులు, రెండు పాన్ కార్డులు, ఐదు ఓటర్ ఐడీ కార్డులు, ఒక డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఐసీ పాలసీ బాండ్స్, మూడు ఏటీఎం కార్డ్స్, భారత్ గ్యాస్ బుక్, మూడు బ్యాంకులకు సంబంధించిన ఐదు పాస్‌పుస్తకాలు, నాలుగు బర్త్ సర్టిఫికెట్లు, ఒక యూఎన్‌హెచ్‌సీఆర్ ఐడీ కార్డు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.