Hyderabad | మేడ్చల్/కీసర, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ అండదండలతో కొందరు అక్రమార్కులు దర్జాగా వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి.. అందులో యధేచ్ఛగా అక్రమ వ్యాపారాన్ని సాగిస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకొంటున్నా.. సర్కారు పట్టించుకోవడం లేదు. మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో సాల్వో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరిట నగరానికి చెందిన జయరాంరెడ్డి అనే వ్యక్తి సాల్వో కంపెనీ నెలకొల్పాడు.
ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ప్రభుత్వ భూమిలో సాల్వో పేరుతో అమోనియం నైట్రేట్ పదార్థాల నిల్వల పేరుతో సుమారు 350 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. అంకిరెడ్డిపల్లిలోని సర్వే నంబర్ 886లో 19 ఎకరాలు, సర్వే నంబర్ 887లో 10 ఎకరాలు సర్వే నంబర్ 918లో 295 ఎకరాలు మొత్తం 325.02 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్రహరీ నిర్మించి ప్రభుత్వ స్థలంలో మైనింగ్ మాఫియాను కొనసాగిస్తూ ఎక్స్‌ప్లోజివ్స్‌లను ఇతర రాష్ర్టాలకు విక్రయిస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకొంటున్నా.. ప్రభుత్వం మాకేందులే అన్న విధంగా వ్యవహరిస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అంకిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి 918 సర్వే నంబర్లో 295 ఎకరాలు, 886లో 19.23 ఎకరాలు, 887లో 10 ఎకరాలు మొత్తం 325 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి 1954 నుంచి 2024 వరకు సెత్వార్, కాస్రా, ఆన్లైన్ రికార్డుల్లో 325 ప్రభుత్వ భూమి అంకిరెడ్డిపల్లికి సంబంధించిందని స్పష్టంగా ఉంది. ఆ భూమిని 2012లో అప్పటి ప్రభుత్వ రెవెన్యూ అధికారులు మాన్యువల్ పహణీలో ఆ భూమి నల్గొండ జిల్లా రామలింగంపల్లి బొమ్మాలరామారం మండలానికి చెందిందని తప్పుడు రికార్డును నమోదు చేశారని అంకిరెడ్డిపల్లి గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆ భూమిని రామలింగంపల్లిలోని సర్వే నంబర్ 312లో చిత్రీకరించి.. ఈ సర్వే నంబర్లో మొత్తం 590 ఎకరాల భూమి ఉన్నట్టు చూపించారన్నారు. అంకిరెడ్డిపల్లికి సంబంధించి 250 ఎకరాల పట్టా భూములు, 325 ఎకరాల ప్రభుత్వ భూములను రామలింగంపల్లి గ్రామంలో ఎక్కించారు.
1965లోనే అంకిరెడ్డిపల్లిలోని 325 ప్రభుత్వ భూమికి సంబంధించి ఎలాంటి సమస్యలు లేవంటూ.. ఆ భూమిని జీవో నం. 393, 24/03/1966 సంవత్సరంలోనే కీసర రెవెన్యూలో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తప్పుదోవ పట్టించి రెవెన్యూ అధికార యంత్రాంగం హైకోర్టుకు చూపించడం లేదు. ఆ భూమికి సంబంధించి ఆర్డీడీ సర్వే జరిగిందని జిల్లా కలెక్టర్ దగ్గర నిర్ణయం పెండింగ్ ఉందని కీసర మండల రెవెన్యూ అధికారులు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ బడా బాబులకు దాసోహమవుతున్నారు. ఇదంతా పెండింగ్ ఉన్నప్పుడు ఆ ల్యాండ్‌కు సంబంధించి మ్యాప్ బయటికి ఏ విధంగా వస్తుందని అంకిరెడ్డిపల్లి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ స్థలంలో ఎవరూ పనిచేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసినా జయరాంరెడ్డి కంపెనీ నిర్వాహకులు యధేచ్ఛగా అక్రమ నిర్మాణాలు, మైనింగ్ పనులు కొనసాగిస్తున్నారు.
అంకిరెడ్డిపల్లిలో కబ్జాకు గురవుతున్న సుమారు 325 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి ఇప్పటికీ అనేక సార్లు ప్రజాదర్బార్, ప్రజాభవన్‌లో ఫిర్యాదు చేశామని స్థానికులు పేర్కొంటున్నారు. సాల్వో కంపెనీ చైర్మన్ జయరాంరెడ్డి అంకిరెడ్డిపల్లిలోని ప్రభుత్వ భూమితో పాటు తమ గ్రామంలో ఉన్న 60 నుంచి 70 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి ఒక్కరిద్దరి దగ్గర నోటరీ చేయించుకొని మిగతా లబ్ధిదారులకు సంబంధించిన భూమిని కూడా కబ్జా చేసి అందులోకి ఎవరిని రానివ్వడం లేదని స్థానికులు అనేకసార్లు కంపెనీ ముందు కూడా అందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నేతలు, అధికారుల అండదండలతో సాల్యో ఇండస్ట్రీస్ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఏకంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఆ ప్రభుత్వ భూమిలో సాల్వో కంపెనీ పేరుతో బ్లాస్టింగ్ పదార్థాలను ఇతర రాష్ర్టాలకు సరఫరా చేస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. రెండు జిల్లాల ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసి ప్రభుత్వం వద్ద ఉన్న పెద్దలను ఎప్పటికప్పుడు మేనేజ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములే కాదు అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పేదలకు అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను సైతం సుమారు 20 నుంచి 30 మంది దగ్గర 60 ఎకరాల వరకు అసైన్డ్ దారుల నుంచి అక్రమంగా కొనుగోలు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
రిజిస్ట్రేషన్ కాని భూములను దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నోటరీలతో భూములను కాజేసి యధేచ్ఛగా ఆ భూము ల్లో తన వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. చాలా ఏండ్లుగా స్థానికంగా ఉన్న ప్రజలు తమ భూములను కబ్జా చేశారని.. వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను కబ్జా చేసి ఆ స్థలంలో గోడను నిర్మించి తమ వ్యాపారాన్ని గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. సర్వే నంబర్లు 918లో 295 ఎకరాలు, 886లో 19 ఎకరాలు, 887లో 10 ఎకరాలు మొత్తం 325.02 ఎకరాలు ప్రభుత్వ భూమి కీసర మండలంలోకి వస్తున్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది.
రామలింగంగంపల్లి, అంకిరెడ్డిపల్లి గ్రామాల మధ్య బార్డర్ ఇష్యూ ఉంది. ఆర్డీడీ ద్వారా సర్వే చేశాం. ఉన్నతాధికారుల దగ్గర ఈ ఇష్యూ పెండింగ్‌లో ఉంది. రెండు మూడు నెలల్లో నిర్ణయం వెలువడుతుంది. మాకు వచ్చే ల్యాండ్‌ను మేము తీసుకొంటాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తాం. ప్రైవేటు సెక్యూరిటీతో ఇక్కడ సాల్వో కంపెనీలో తయారు చేసే ఎక్స్‌ప్లోజివ్‌లను సెంట్రల్ గవర్నమెంట్‌కు సరఫరా చేస్తారు. 325 ప్రభుత్వ భూమి అని నిర్ధారణ కాలేదు. ఈ రెండు బార్డర్లపై స్టేటస్కో ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే అక్కడ ప్రభుత్వ బోర్డులు పెట్టేలా నిర్ణయం తీసుకుంటాం. అక్కడ ఉన్న రెండు చెరువులు కబ్జాకు గురైనట్లు ఆరోపణలున్నాయి ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చాం.
– కీసర తహసీల్దార్ అశోక్‌కుమార్