సిటీబ్యూరో/ కేపీహెచ్‌బీ కాలనీ: జీహెచ్ఎంసీలో అక్రమ నిర్మాణాలను అడ్డుకట్ట వేయడంలో యంత్రాంగం విఫలమవుతున్నది. కొందరి అధికారుల అండతో అక్రమార్కులు రెచ్చిపోతుండటంతో పుట్టగొడుగుల్లా నిర్మాణాలు వెలుస్తున్నాయి. అనుమతి కోసం వచ్చే దరఖాస్తులను వేర్వేరు కారణాలతో తొక్కి పెట్టడం, భయాందోళనకు గురయ్యే యజమానుల నుంచి ముడుపులు తీసుకోవడం కొందరికీ అలవాటుగా మారింది. చైన్మెన్ల నుంచి న్యాక్ ఇంజినీర్లు, టీపీఎస్‌లు, ప్లానింగ్ ఉన్నతాధికారుల వరకు కొందరు అక్రమ సంపాదన మత్తులో తూగుతూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు.
ఫిర్యాదులపై డోంట్‌కేర్ …
కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని వసంత నగర్ కాలనీ 1989 లో 964 ప్లాట్లతో ఏర్పడింది. ఇటీవల ప్లాట్ నంబర్ 520, 263,213/A, 710 ప్లాట్ల తోపాటు మరికొన్ని చోట్ల జీహెచ్ఎంసీ నిబంధనలను అతిక్రమించి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ అంశంపై వసంత నగర్ సొసైటీ సమావేశంలో ఆయా బిల్డర్లను పిలిచి నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేయొద్దని కోరారు. అయినా వారు నిర్మాణ పనులు కొనసాగించడంతో ఏప్రిల్ 4న కూకట్పల్లి జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. జూన్ 7న బల్దియా కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా, జూన్ 14న ఆ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసి… జూలై 7న ఆ నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేశారు. మళ్లీ నిర్మాణ పనులు కొనసాగించడంతో ఫిర్యాదు చేయగా డిసెంబర్ 19న ప్లాట్ నంబర్ 520, 263, 213/A, 710లలో అక్రమంగా నిర్మిస్తున్న భవనాలను సీజ్ చేశారు. మరుసటి రోజు ఆ సీజ్‌ను తొలగించి పనులు కొనసాగించడంతో మూసాపేట ఉప కమిషనర్ కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయినా ప్లాట్ నంబర్ 520, 263లలో పనులను మళ్లీ మొదలుపెట్టి కొసాగిస్తున్నారు.
క్రిమినల్ కేసులు నమోదైనా..
మూసాపేట సరిల్ లో అక్రమ నిర్మాణదారులపై క్రిమినల్ కేసులు నమోదైనా… ఆ నిర్మాణదారులు యధేచ్ఛగా నిర్మాణ పనులను కొనసాగిస్తూ అధికారులకు సవాల్ విసిరుతున్నారు. నిబంధనలను అతిక్రమిస్తూ నిర్మాణ పనులు చేపడితే ఆదిలోనే గుర్తించి వాటిని అడ్డుకట్ట వేయాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు.. అందిన కాడికి పుచ్చుకొని చూసీ చూడనట్లు వదిలేశారు. ఈ వ్యవహారంపై వసంత నగర్ సొసైటీ సభ్యులు అనేకసార్లు ఫిర్యాదు చేసినా.. తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని నిర్మాణాదారులతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని ఆ నిర్మాణాలను పూర్తి చేసేలా సహకరించారు. అయినా పట్టు విడవకుండా సొసైటీ నుంచి ఫిర్యాదులు రావడంతో ఇక తప్పదు అన్నట్లు నిర్మాణదారులకు నోటీసు జారీ ఆ నిర్మాణాలను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ నిర్మాణదారులు సీజ్‌ను తొలగించి మళ్లీ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. సొసైటీ నుంచి మళ్లీ ఫిర్యాదులు అందడంతో ఆ నిర్మాణదారులపై కేపీహెచ్‌బీకాలనీ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా వారిపై కేసులు నమోదయ్యాయి. కానీ అక్రమ భవన నిర్మాణాలు చేస్తున్న వారు బిల్డింగ్ సీజ్ చేసినా.. వారిపై కేసులు నమోదైనా భయం లేకుండా మళ్లీ పనులు కొనసాగిస్తున్నారు. ‘మా స్థలంలో మేము ఎన్ని అంతస్తులైనా కట్టుకుంటాం… కేసులు నమోదు చేసినా.. వాటిని ఎదురొంటాం.. కానీ నిర్మాణ పనులను ఆపబోం’ అని తేల్చి చెబుతుండడం గమనార్హం.
అడ్డుకట్ట వేసేది ఎవరు..?
మూసాపేట సరిల్ పరిధిలో పలు కాలనీల్లో బల్దియా నిబంధనలను అతిక్రమిస్తూ భవన నిర్మాణ పనులు సాగుతున్న టౌన్ ప్లానింగ్ యంత్రాంగం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఆదిలోని నిర్మాణాలను గుర్తించి సమాచారం ఇవ్వాల్సిన న్యాక్ ఇంజినీర్లు సరిగా పనిచేయడం లేదు. జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో కొనసాగే స్పెషల్ టాస్ ఫోర్స్ టీం కూడా ఈ నిర్మాణాలను అడ్డుకట్ట వేయడంలో పూర్తిగా విఫలమవుతున్నది. ఆదిలోనే అక్రమ నిర్మాణా లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు… కోర్టు నుంచి కొత్త ఉత్తర్వులు రావాలని అప్పుడే ఆ నిర్మాణాలను కూల్చివేస్తామని కాలయాపన చేస్తుండడం అక్రమ నిర్మాణదారులకు వరంగా మారింది. అకడ నిర్మాణాలకు నోటీసులు జారీ చేస్తూ… సీజ్ చేస్తున్నారే తప్ప.. ఆ నిర్మాణాలు కొనసాగుతున్న వాటిని కూల్చి వేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఎవరైనా ఆ నిర్మాణాలపై ఫిర్యాదులు చేస్తే నోటీసులు ఇచ్చామని సీజ్ చేస్తామని చెబుతూ… రెండు రిబ్బన్లు కట్టి జారుకుంటున్నారు. మరునాడే జీహెచ్ఎంసీ సీజ్‌ను తొలగించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. అయినప్పటికీ ఆ నిర్మాణదారులు పనులను ఆపకుండా ఈ చర్యలన్నీ మామూలేనని భావిస్తూ యధావిధిగా నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు.
క్రిమినల్ కేసులు నమోదు చేశాం…
వసంతనగర్ కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న బిల్డింగ్‌కు నోటీసులు జారీచేసి తదనంతరం సీజ్ చేశాం. అయినా పనులు కొనసాగుతూ ఉండడంతో కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేశాం. అయినా బిల్డర్లు భయపడకుండా మళ్లీ బిల్డింగ్ పనులు చేస్తున్నట్లు మాకు ఫిర్యాదులొచ్చాయి. ..సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
– వంశీకృష్ణ, డిప్యూటీ కమిషనర్ మూసాపేట సరిల్