చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 19: మహానగరానికి అతి చేరువలో ఉన్న శంకర్పల్లి పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులకు రక్షణ కరువైంది. శంకర్పల్లి మండల పరిధి దొంతాన్పల్లి గ్రామ పంచాయతీలో ఉన్న తుర్క చెరువు (Turka Cheruvu) అక్రమణలకు గురై రోజురోజుకు కుచించుకుపోతున్నది. తుర్క చెరువు 111 జీవో పరిధిలో ఉన్నది. బఫర్ జోన్‌ను ఆక్రమించి చిన్నపాటి షెడ్డులు కట్టేందుకు కూడా అవకాశం ఉండదు. కానీ, బఫర్ జోనే కాదు.. ఎఫ్టీఎల్ను కబ్జా చేసి అందులో మట్టి పోసి ఏకంగా విల్లాలు, ఫాం హౌస్‌ల నిర్మాణాలు చేపట్టారు.
చెరువులో ఆక్రమణలను గుర్తించిన ఇరిగేషన్ అధికారులు నాలుగేండ్ల క్రితమే నలుగురు వ్యక్తులపై పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ప్రివెన్షన్ యాక్ట్ (పీడీపీపీ) కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు లేఖలు కూడా రాశారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా మరి కొందరు చెరువును ఆక్రమించి మరిన్ని నిర్మాణాలు చేపట్టారు.
స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతోనే ఇది జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగినప్పుడు చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎందుకు మౌనం పాటించారని, ఇప్పుడు అంతా జరిగిపోయిన తర్వాత ఎందుకు హడావుడి చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏదేమైనా తుర్క చెరువు ఆక్రమణలపై సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచిచూడాల్సిందే.
శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి గ్రామానికి ఉత్తరం వైపున హైదరాబాద్- శంకర్పల్లి రోడ్డు పక్కన సర్వే నంబర్లు 6/1, 6/2. 9, 10, 11, 12,13, 18,22 , 26/1లలో 28 .08 ఎకరాల్లో తుర్క చెరువు విస్తరించి ఉంది. దీనికి ఎఫ్టీఎల్ నుంచి 30 మీటర్ల బఫర్ జోన్ కూడా నిర్ధారించారు. ఈ చెరువు కింద గ్రామస్తులు గతంలో పంటలు పండించేవారు. చెరువు నిండితే చుట్టు పక్కల బోర్లు నిండుగా పోస్తే సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు.
హైదరాబాద్ నగరం మోకిలా, శంకర్పల్లి వరకు విస్తరించడంతో ఈ ప్రాంత భూములకు భారీగా డిమాండ్ పలుకుతున్నది. దీంతో తుర్క చెరువుపై కన్నేసి బఫర్ జోనే కాదు ఎఫ్టీఎల్ను కూడా ఆక్రమించారు. చెరువులో మట్టి పోసి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు 2021 మార్చి 20 నుంచి 25 వరకు తుర్క చెరువు స్థలాన్ని పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు ఆక్రమణలు నిజమేనని తేల్చారు. శ్రీనివాస్ రాజ్ అనే వ్యక్తి సర్వే నంబర్లు 9,10,11,18లో, మహమ్మద్ ఆరిఫ్ ఖాన్, రహీమ్ అనే వ్యక్తులు సర్వే నెంబర్ 6/2లో, రాజేష్ జైన్ సర్వే నెంబర్లు 12, 22, 26/2లో చెరువు స్థలాన్ని ఆక్రమించి మట్టితో నింపినట్లు గుర్తించారు. అంతే కాదు అందులో అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టడంతో 2021 మార్చి 26న పీడీపీపీ యాక్ట్-1984 కింద శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని, ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు లేఖలు రాసినట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు.
దొంతాన్పల్లి తుర్క చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లను ఆ్రకమించి నిర్మాణాలు చేపట్టినట్లు తమకు ఫిర్యాదులు అందాయని శంకర్పల్లి మండల తహసీల్దార్ సురేందర్ అన్నారు. ఇరిగేషన్ అధికారులు గతంలోనే పలువురిపై కేసులు నమోదు చేయించారు. వాటిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని లేఖలు కూడా రాశారు. సమగ్ర విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
చెరువు ఆక్రమణలకు గురైందని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రెండు సార్లు నోటీసులు అందజేశామని దొంతాన్పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కల్యాణ్ చెప్పారు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు తీర్పు అనంతరం ఉన్నతాధికారుల సూచనలను తూచా తప్పకుండా పాటించి ముందుకు వెళ్తామని తెలిపారు.