Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 10: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మిస్తున్న ఇండ్లను షేక్‌పేట్ మండల రెవెన్యూ సిబ్బంది గురువారం నేలమట్టం చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46 లోని అంబేద్కర్ నగర్‌ను ఆనుకొని ఉన్న జేఎన్ఆర్ఎమ్ ఇండ్ల పక్కన సుమారు 1500 గజాల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. గతంలో ఇక్కడ ఐదు బ్లాకులు నిర్మించాల్సి ఉండగా నాలుగు బ్లాకులు మాత్రమే నిర్మించారు. 64 మంది లబ్ధిదారులకు జేఎన్ఆర్ఎమ్ ఇండ్లను కేటాయించారు. కాగా మరో బ్లాకు నిర్మాణం నిలిచిపోయింది.
ఇటీవల బస్తీలోని కొందరు నేతలు ఖాళీ స్థలాన్ని తలా కొంచెం పంచుకుని ఇండ్ల నిర్మాణం ప్రారంభించారు. నెల రోజుల క్రితం వీటిని కూల్చిన రెవెన్యూ అధికారులు స్థానిక నేతలపై కేసు నమోదు చేశారు. అయితే మరోసారి రెండు రోజులుగా ప్రభుత్వ స్థలంలో గదుల నిర్మాణం చేపట్టడంతో సమాచారం అందుకున్న షేక్‌పేట మండల తహసిల్దార్ అనితారెడ్డి తన సిబ్బందితో వచ్చి కూల్చివేతలు చేపట్టారు. ఈ క్రమంలో బస్తీ నేతలు వెంకన్న, అరుణ తదితరులు రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సెల్ ఫోన్ లాక్కుని న్యూసెన్స్ చేశారు. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చర్యలు చేపట్టనున్నామని తహసిల్దార్ హెచ్చరించారు.