ముషీరాబాద్, ఆగస్టు 30: రాంనగర్ మణెమ్మ గల్లీలో నాలా, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కట్టడాలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు ఆక్రమణలను నేలమట్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆక్రమణలను పరిశీలించిన 24 గంటలోపే అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రణాళికా సిద్ధం చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు రంగనాథ్ ఆదేశించడంతో హు టాహుటిన మణెమ్మ గల్లీని సందర్శించి వివరాలు సేకరించారు. అటు టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు నాలా, రోడ్డును ఆక్రమించినట్లు నివేదిక ఇవ్వడంతో శుక్రవారం కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ జేసీబీ, గ్యాస్ కట్టర్లు, ఆక్రమణలను నేలమట్టం చేశారు.
సర్వే నం. 20, 21 వార్డ్ 155 బ్లాక్ జమిస్తాన్‌పూర్‌లో కొందరు వ్యక్తులు స్థలాన్ని ఆక్రమించి కల్లు కాంపౌండ్, మరొకరు నాలాను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేట్టడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డును ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణల నేపథ్యం విక్రమ్, సాయి యాదవ్‌లకు చెందిన 50 గజాల స్థలంలో ఉన్న ఒక గది, ఎల్లయ్య పేరుతో ఉన్న మూడు అంతస్తుల నిర్మాణాన్ని తొలగించారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ దేవేందర్, సెక్షన్ ఆఫీసర్ హఫీజ్ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు.