Ghatkesar | ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 21: ఘట్కేసర్ పట్టణంలో కొనసాగుతున్న బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా స్థానికంగా కూల్చివేతలూ కొనసాగుతున్నాయి. మండల రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేతలు జరిపారు. ఈ సందర్భంగా స్థలాలు కోల్పోతున్న బాధితులకు నష్ట పరిహారం చెల్లించిన తర్వాతే కూల్చివేతలు జరుపాలని బాధితులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే కూల్చివేతలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లిడించారు.
ఘట్కేసర్లో బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని బీఆర్ఎస్, బీజేపీలు ముందుండి ఉద్యమాన్ని నడిపించాయని, అది గిట్టని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్‌లు ప్రతి పక్ష పార్టీలను విమర్శించటం ఎంత వరకు సమంజసమని మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఘట్కేసర్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ, ఐదేండ్లు మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుధీర్ రెడ్డికి చేత కాలేదని, ఒక్కసారి సర్పంచ్‌గా కూడా గెలువకుండా ఏ అధికారం లేకుండా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్న వజ్రేశ్ యాదవ్‌లు విమర్శించటం సిగ్గుచేటన్నారు.
కాంట్రాక్టర్‌కు డబ్బులు ఇప్పించలేని నాయకులకు రిలే నిరహార దీక్షకు మద్దతు యిచ్చిన పార్టీలను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఇకనైనా బ్రిడ్జి నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలని, భూ బాధితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. లేనిచో మరల ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఘట్కేసర్ పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా శనివారం కూల్చివేతలు జరిపారు. నష్ట పరిహారం చెల్లించకుండా కూల్చివేతలు జరపటంపై మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి విమర్శించారు.