HYDRAA | సిటీబ్యూరో: మళ్లీ హైడ్రా కూల్చివేతలు స్పీడందుకున్నట్లేనా..! అంటే అవుననే చెబుతున్నారు అధికారులు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలంటూ తమ కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదులపై దృష్టి పెట్టిన హైడ్రా.. ఆయా ప్రాంతాల్లో సంబంధిత శాఖల రిపోర్టుల ఆధారంగా కూల్చివేతలను కొనసాగించనున్నది. ఓఆర్ఆర్ లోపల చాలా ప్రాంతాల్లో రోడ్లు, పార్కులు కబ్జా చేశారంటూ.. కాలనీల నుంచి వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా బృందాలు వేర్వేరుగా స్థానిక అధికారులతో కలిసి కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు తెలుసుకున్నాయి.
ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లాతో పాటు ఓఆర్ఆర్ లోపల పలుచో ట్ల కూల్చివేతలు చేసిన హైడ్రా.. ఈ రెండుమూడురోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లో కూల్చివేతలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే హైడ్రా బృందం రెవెన్యూ, ఇరిగేషన్, లీగల్ టీంలతో కలిసి తమ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. ఇందులో ఎక్కడ సులువుగా పని జరుగుతుందో, న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఉంటాయో చూసుకొని.. అక్కడ తమ బృందాలతో చర్యలకు సిద్ధమవుతున్నది.
ఈ నెల రోజుల్లో హైడ్రా కార్యాలయానికి వందకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా పలు కాలనీల్లో నాలాలు, పార్కులు, రోడ్ల ఆక్రమణలపై కాలనీలు, స్థానికుల నుంచి ఈ ఫిర్యాదులొచ్చాయి. అయితే అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పటేల్‌గూడలో హైడ్రా కూల్చివేతలపై భూ యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు సర్వేకు ఆదేశించి తదుపరి చర్యల వరకు స్టేటస్ కో విధించింది. కోర్టు వివాదాల నేపథ్యంలో తమ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ లీగల్ టీంతో సమీక్షించారు. ఫిర్యాదుల్లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు వచ్చే న్యాయపరమైన చిక్కులపై చర్చించారు.
హైడ్రా కార్యాలయానికి గత నెల వరకు వర్షాల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులపై వచ్చిన ఫిర్యాదులే ఎక్కువగా రాగా ఈ నెల రోజుల నుంచి మాత్రం పార్కులు, నాలాలు, రోడ్ల ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులే వచ్చినట్లు హైడ్రా అధికారి చెప్పారు. వీటిపై సంబంధిత శాఖల నుంచి హైడ్రా కమిషనర్ ప్రాథమిక నివేదిక కోరారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు సంబంధించి స్థానిక రెవెన్యూ అధికారుల నుంచి నివేదిక తీసుకున్న తర్వాత వాటిపై చర్యలకు దిగనున్నట్లు తెలిసింది.
ఓఆర్ఆర్ లోపల జీహెచ్ఎంసీతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామపంచాయతీలు హైడ్రా పరిధిలోకి వస్తాయి. వీటిలో హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పార్కులు, రోడ్ల స్థలాల ఆక్రమణలపై వచ్చిన వాటిపై హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించింది. ఆక్రమణలు చేసిన వారికి నోటీసులు కూడా ఇచ్చామని వారి నుంచి వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో రెండోసారి కూడా నోటీసులను జారీ చేసినట్లు హైడ్రా అధికారులు చెప్పారు.
ఇప్పటివరకు కార్యాలయానికి వచ్చిన వందకు పైగా ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరిశీలించి అందులో ఆక్రమణదారులుగా పేర్కొంటున్న 40 మందికి నోటీసులు ఇచ్చారు. వారికిచ్చిన గడువు ముగిసిన తర్వాత వారి వివరణను బట్టి చర్యలకు దిగడానికి హైడ్రా సిద్ధమవుతున్నది. అయితే చాలాచోట్ల కోర్టు వివాదాలకు సంబంధించిన భూములపై కూడా ఫిర్యాదులు రావడంతో వాటిపై లీగల్ టీం సలహా మేరకు ముందుకు వెళ్లనున్నారు. రెవెన్యూ, మున్సిపల్ రికార్డులను అనుసరించి ఆక్రమణలుగా తేల్చిన వాటిని తొలగించేందుకు హైడ్రా రెడీ అయింది.