బండ్లగూడ, జులై 10 : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బిల్డర్లు భారీ సెల్లార్లను తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ యథేచ్చగా సెల్లార్ల తవ్వకాలు చేపడుతున్నారు. ఇదంతా బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఓ భవన నిర్మాణదారుడు భారీ సెల్లారు తవ్వుతుండగా కార్పొరేషన్ అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
వర్షాకాలంలో సెల్లార్ తవ్వకాలను చేపట్టడం ద్వారా అనేక ప్రమాదాలకు దారి తీస్తుందని ప్రభుత్వం వర్షాకాలంలో సెల్లార్లు తీయవద్దని నిబంధనలను తీసుకువచ్చిన విషయం విదితమే. కాగా బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్ నుంచి బండ్లగూడ చౌరస్తా వరకు ఉన్న రోడ్డును అనుకొని ఇరువైపులా సెల్లార్ల తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే 100 గజాల స్థలంలో సెల్లార్ తీయడంతో పాటు స్లాబ్‌లను కూడా వేస్తున్నారు. ఇదంతా ప్రతిరోజు కార్పొరేషన్ కమిషనర్‌తో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం రోజు ఈ మార్గం గుండా రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న సెల్లార్లను చూసి చూడనట్టు వదిలేయడంపై స్థానిక ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది.
అంతా అధికారుల కనుసైగల్లోనే..
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్, బండ్లగూడ, పీరంచెరువు, గంధం గూడ, బైరాగి గూడా తదితర ప్రాంతాలలో నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో అనుమతులు లేకుండానే సెల్లార్ల తవ్వకాలు చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. అయినా అధికారులు తమకేమీ తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. నిర్మాణదారుల వద్ద డబ్బులు తీసుకోవడంతోనే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని సెల్లార్ల తవ్వకాలు నిలిపివేయకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.