మియాపూర్ : శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని సిద్ధిక్నగర్లో ఓ అక్రమ నిర్మాణం ప్రభావంతో సమీపంలోని భవనం ఒరిగిన ఘటనతో పట్టణ ప్రణాళికా అధికారుల్లో కదలిక వచ్చింది. ఈ ఘటనతో ఓ భవనాన్ని నేలమట్టం చేయాల్సి రావడంతో ప్రజానీకం తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ప్రధానంగా ఎటువంటి అనుమతుల్లేకుండా తక్కువ స్థలంలో ఎక్కువ మొత్తంలో అంతస్తులు నిర్మిస్తూ.. వాటిని నిబంధలకు విరుద్ధంగా హాస్టళ్లకు అద్దెకిస్తూ లక్షలాది రూపాయలను యజమానులు పోగేసుకుంటున్నారు.
ఈ తరహా అక్రమ నిర్మాణాల్లో పరోక్షంగా అధికారులకు ముడుపులు అందుతుండటం వల్లే నోరు మెదపటం లేదన్న ఆరోపణలు సైతం వస్తున్నాయి. తాజా ఘటన నేపథ్యంలో సిద్ధిక్నగర్లో నిర్మాణాలపై పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు సీరియస్గా దృష్టి సారించారు. వంద గజాల్లోనే ఏకంగా ఐదారుకు మించి అంతస్తులు నిర్మిస్తుండటం.. కొందరు సెల్లార్లు సైతం తవ్వుతుండటంతో సమీప నివాసాలకు పెను ప్రమాదంగా మారుతున్నది.
రెండు రోజుల కిందట సిద్ధిక్నగర్లో ఇలా ఓ అక్రమ నిర్మాణం ప్రభావం కారణంగానే పక్కనే ఉన్న భవనం పక్కకు ఒరిగి ప్రమాదపు అంచుల దాకా వెళ్లింది. దీంతో సదరు భవనాన్ని అధికారులు భారీ యంత్రాల సాయంతో నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. అయితే సిద్ధిక్నగర్లో ఇలా కుప్పలు తెప్పలుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నట్లు, వాటిని హాస్టళ్లకు అద్దెలికిచ్చి యజమానులు లక్షల్లో కిరాయిలు పొందుతున్నారు.
దీంతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనాలతో పాటు ఇప్పటికే పూర్తయి హాస్టళ్లు కొనసాగుతున్న భవనాల సర్వేను తాజాగా పట్టణ ప్రణాళికా విభాగం చేపట్టింది. నాలుగైదు బృందాలు సిద్ధిక్నగర్లో పర్యటిస్తూ భవనాల వివరాల నమోదును ఆరంభించాయి. సర్వే అనంతరం అనుమతుల్లేకుండా నిర్మించడంతో పాటు హాస్టళ్లు కొనసాగుతున్న భవనాలన్నింటినీ సీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. భవనం విస్తీర్ణం, అంతస్తులు, ఏ తరహా వినియోగంలో ఉన్నదనే వివరాలను సర్వేలో నమోదు చేస్తున్నారు. అవసరమైతే యజమానులపై కేసులు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులోగా చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.