కుత్బుల్లాపూర్ : ప్రధాన రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొంపల్లి 44వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకొని దూలపల్లి నుంచి నర్సాపూర్ రాష్ట్ర రహదారికి వెళ్లే ప్రధాన దారిలో అనధికారికంగా ప్రచార బోర్డులు, లాలీపాప్స్, బాహుబలి వంటి పెద్దపెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా బోర్డులు, హోర్డింగులు ఏర్పాటు చేయడం ద్వారా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ రోడ్డు గుండా పెద్దపెద్ద వాహనాలతోపాటు ఇతర వాహనాలు వేల సంఖ్యలో వెళ్తుంటాయి. దూలపల్లి, జీడిమెట్ల, దుండిగల్ ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక ప్రదేశాలకు సామాగ్రిని తరలించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అదేవిధంగా కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, సిబ్బంది కూడా ఈ దారిలో రాకపోకలు సాగిస్తుంటారు. దాంతో ఈ మార్గంలో వాణిజ్య, నిర్మాణ రంగాల వారితోపాటు రాజకీయ పార్టీల నేతలు ప్రచారం కోసం పెద్ద ఎత్తున హోర్డింగులు, బోర్డులు ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇవి వాహనదారుల పాలిట మృత్యుపాశాలుగా మారాయి. ఆ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులకు యూటర్న్ల దగ్గర ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరగుతున్నాయి. గత ఆరు నెలలుగా ఈ మార్గంలో యూటర్న్ల వద్ద నలుగురు మృత్యువాతపడగా.. 15 మందికి పైగా ప్రమాదాలకు గురయ్యారు. దాంతో బాధిత కుటుంబాలు శోకసంద్రంలో కూరుకుపోయాయి.
వాస్తవానికి ప్రచార బోర్డులు, లాలీపాప్‌లు, హోర్గింగుల గడువు ముగిసింది. అప్పటి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రచారాలు చేసుకుంటున్నారు.
దాంతో వాటివల్ల ప్రభుత్వానికి పైసా ఆదాయం రావడంలేదని తెలిసింది. దూలపల్లిలో రోడ్డు నడుమ లాలీపాప్‌లు 200, భారీ హోర్డింగులు 20కి పైగా అనధికారికంగా ఉన్నాయి. స్థానికులు హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదుతో ఏప్రిల్‌లో మూడు భారీ హోర్డింగులతోపాటు మరికొన్ని లాలీపాప్ ప్రకటన బోర్డులను కూల్చివేసింది. ఇదిలావుంటే ప్రకటన కర్తల నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరులు కొన్నేండ్లుగా లక్షల్లో వసూలు చేస్తున్నట్లు సమాచారం. అక్రమ వసూలు రాయుళ్ల అండదండలతో హైడ్రా కూల్చివేసిన భారీ హోర్డింగులను ప్రకటన కర్తలు మళ్లీ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇంత జరుగుతున్నా కొంపల్లి మున్సిపాలిటీ అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారని, అక్రమంగా హోర్డింగులను, బోర్డులను ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనధికారికంగా ఏర్పాటు చేసిన హోర్డింగులను, బోర్డులను తొలగించడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన లాలీపాప్స్‌ను తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.