వనస్థలిపురం, అక్టోబర్ 14: ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట’ అనే సామెత అచ్చంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సన్నబియ్యం పింపిణీకి సరిపోతుంది. సన్నం బియ్యం పంపిణీని అట్టహాసంగా ప్రారంభించి జోరుగా ప్రచారం నిర్వహించిన ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమైందన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ప్రతి షాపునకు ఉన్న పాత రేషన్ కార్డులు, ఎనీవేర్ పేరుతో ఇతర జిల్లాలకు చెందిన లబ్ధిదారులతో పాటు ఇటీవల కొత్తగా వచ్చిన రేషన్ కార్డుదారులకు ఇవ్వాల్సిన బియ్యం కోటా ఇవ్వకుండా సగం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది. దీంతో చేసేదేమీ లేక రేషన్ డీలర్లు వచ్చిన బియ్యాన్ని పంపిణీ చేసి షాపులు మూసి వేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు చెప్పులరిగేలా రేషన్ షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
15వ తేదీ వరకే పంపిణీ..
నిబంధనల ప్రకారం ప్రతి నెల 15వ తేదీ లోపు సన్నబియ్యం పంపిణీ చేయాలి. అయితే అక్టోబర్ నెలకు సంబంధించి ఇప్పటివరకూ సగం మందికి కూడా బియ్యం పంపిణీ చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. నగరంలో వివిధ జిల్లాలకు చెందిన లబ్ధిదారులు అధికంగా ఉంటారు. ప్రభుత్వం ఎనీవేర్ విధానం తీసుకురావడంతో ఒక్కో రేషన్ షాపునకు ప్రతి నెలా 250 నుంచి 300 టన్నుల బియ్యం అవసరం ఉంటుంది. కాగా అక్టోబర్ నెల కోటాకు సంబంధించి ఒక్కో షాపునకు 100 నుంచి 150 టన్నులు మాత్రమే వచ్చింది. దీంతో వచ్చిన బియ్యాన్ని వచ్చినట్లే రేషన్ డీలర్లు పంపిణీ చేయడంతో మిగతా లబ్ధిదారులకు, డీలర్లకు గొడవలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. 15వ తేదీ చివరి తేదీ కావడంతో ఇప్పటివరకూ బియ్యం ఇవ్వకుంటే మా పరిస్థితి ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
కొత్త కార్డుదారులకు తప్పని అవస్థలు
ఇటీవల ప్రభుత్వం కొత్తగా లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేసినా ఈకేవైసీగా నమోదు చేయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్డు వచ్చిన తర్వాత సభ్యులు తప్పకుండా ఈ- కేవైసీ చేసుకోవాలి. కానీ.. రేషన్ డీలర్లు తమ షాపునకు చెందిన కార్డులకు మాత్రమే ఈ-కేవైసీ చేస్తున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని రేషన్ డీలర్లు, లబ్ధిదారులు కోరుతున్నారు.
స్టాక్ లేదు అంటున్నారు
ప్రతి నెల 10వ తేదీ లోపు బియ్యం తీసుకునే వాళ్లం. వారం రోజులుగా స్టాక్ లేదు అంటున్నారు. 15వ తేదీ వచ్చేసింది. ఈ నెల బియ్యం ఇస్తారా ఇవ్వరా? అని అయోమయంగా ఉంది. మా ఏరియాలో ఉన్న 4 షాపులు తిరిగాను. అయినా ఎక్కడా స్టాక్ లేదు అంటున్నారు. ఈ నెల గడువు పెంచి అందరికీ బియ్యం అందించాలి.
– దోటి వెంకటేష్, వనస్థలిపురం