బంజారాహిల్స్, ఏప్రిల్ 14: మరింత సాధనతో పాటు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా తెలంగాణ రెజ్లర్లలో ఉందని ప్రముఖ భారత రెజ్లర్, ఒలంపిక్ పతక విజేత రవి కుమార్ దహియా అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ కేసరి కుస్తీ పోటీలను తిలకిచ్చేందుకు వచ్చిన రవికుమార్ దహియా సోమవారం జూబ్లీహిల్స్‌లోని డైమండ్ స్టోర్‌లో సందడి చేశారు. ఇటీవల గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిన వజ్రాభరణాన్ని రవి కుమార్ దహియా తిలకించారు.
ఈ సందర్భంగా రవికుమార్ దహియా మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ పోటీల్లో భారత తరఫున అత్యధికంగా పతకాలు సాధిస్తున్న క్రీడాకారులు హర్యానా రాష్ట్రం నుంచే వస్తున్నారని అన్నారు. తెలంగాణ, మహారాష్ట్రలో కూడా ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నప్పటికీ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలనే కసి తక్కువగా ఉండడంతో పాటు రాష్ట్ర స్థాయిలో గెలిస్తే చాలు అనే ధోరణిలోనే ఉంటున్నారని తెలిపారు. ఇక్కడి నుంచి కూడా అంతర్జాతీయ పోటీల్లో రాణించేలా కసితో సాధన చేస్తే త్వరలోనే తెలంగాణ నుంచి కూడా కుస్తీలో ఒలంపిక్ పతక విజేత వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పరంగా కూడా కుస్తీకి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.