HYDRAA | ప్రజల్లో అవగాహన కల్పించేందుకే మొదట్లో దూకుడుగా వ్యవహరించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. దీనివల్ల ఇప్పుడు ప్రజలకు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌పై అవగాహన ఏర్పడిందని పేర్కొన్నారు. ఒక ప్రాపర్టీ కొనేముందు ఎఫ్టీఎల్/బఫర్‌జోన్‌లో ఉందా? లేదా? అనే విషయాన్ని చూసుకుంటున్నారని అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైడ్రా వార్షిక నివేదికను రంనాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న చెరువులు, ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడుతుందని రంగనాథ్ స్పష్టం చేశారు. 2 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. హైడ్రా వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటివరకు కాపాడామని చెప్పారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మొదట్లో దూకుడుగా వ్యవహరించామని వివరించారు. ఇప్పుడంతా రిజునవేషన్పైనే దృష్టి పెడతామని చెప్పారు. హైడ్రా కూల్చివేతలు ఆగవని.. ఎఫ్టీఎల్ నిర్ధారణ తర్వాతే మళ్లీ కూల్చివేతలు మొదలు పెడతామని పేర్కొన్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విషయంలోనూ హైడ్రాకు ఒక ప్లాన్ ఉందని తెలిపారు.
హైడ్రా దూకుడు వల్ల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌పై ప్రజలకు అవగాహన ఏర్పడిందని రంగనాథ్ అన్నారు. ప్రస్తుతం ఒక ప్రాపర్టీ కొనేముందు ఎఫ్టీఎల్/బఫర్‌జోన్‌లో ఉందా? లేదా? అనే విషయాన్ని చూసుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. మూసీ రివర్ ఫ్రంట్‌కు తమకు సంబంధం లేదని.. అయినప్పటికీ మూసీ ఆక్రమణలపై కూడా దృష్టి పెడతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. భూ యజమానులకే కాదు.. కిరాయిదారులకు కూడా నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు.
ఔటర్ పరిధిలో 1,025 చెరువులను గుర్తించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వీటన్నింటికీ FTL, బఫర్ జోన్లు గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు. వివిధ డేటా, సాంకేతిక పరిజ్ఞానం, ఏరియల్ సర్వే, డ్రోన్ సర్వే డేటాను కూడా పరిగణనలోకి తీసుకుని FTL, బఫర్ జోన్లు నిర్ధారిస్తామని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 5,800 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. వీటిలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లు ఇచ్చే కంప్లెయింట్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం చెరువుల పునరుజ్జీవనంపై దృష్టి పెట్టామని రంగనాథ్ తెలిపారు. త్వరలోనే 12 చెరువులను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.
చెట్లు పడిపోవడం, నీళ్లు నిలవడం, ఫైర్ యాక్సిడెంట్‌కు సంబంధించిన ఫిర్యాదులు కూడా ఎక్కువగానే వస్తున్నాయని రంగనాథ్ తెలిపారు. వాటిని డీఆర్ఎఫ్ బృందాల ద్వారా అడ్రస్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో తమకు త్వరలోనే 72 డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే తమకు వెదర్ రాడార్ రానుందని.. దీనికోసం సపరేట్ వింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. హైడ్రా ఎఫ్ఎం ఛానల్‌ను కూడా తీసుకొస్తామని ప్రకటించారు. ఇందులో వెదర్ ఫోర్కాస్ట్ చేస్తామని అన్నారు. అన్ని చెరువుల ఎఫ్టీఎల్/బఫర్ జోన్ల వివరాలను తమ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
జూలై 19వ తేదీకి ముందు అనుమతులు తీసుకుని FTL, బఫర్ జోన్ లో ఉన్నా.. ఆ నివాసాలను కూల్చబోమని రంగనాథ్ తెలిపారు. కమర్షియల్ బిల్డింగ్‌లపై మాత్రం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్కులు, నాళాలపై అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి సోమవారం హైడ్రా దగ్గరకు వచ్చి తమ ఫిర్యాదులను అందజేయవచ్చని పేర్కొన్నారు. హైడ్రా ఎవ్వరికీ NOC లు ఇవ్వదని స్పష్టం చేశారు.
మధురా నగర్లో తాము ఉంటున్న ఇల్లు బఫర్ జోన్లో ఉందని సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పుడు అక్కడ చెరువు లేదని.. అయినప్పటికీ తాము చెరువు కట్టకు కింద కిలోమీటర్ దూరంలో ఉన్నామని స్పష్టం చేశారు. అక్కడ లేని వాటి గురించే చర్చిస్తున్నారని.. ఇటువంటి వాటి గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.