BRS | బీఆర్ఎస్ రజతోత్సవం నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ తొలగించారు. కూకట్పల్లి, కేపీహెచ్బీలో బీఆర్ఎస్ రజతోత్సవ ఫ్లెక్సీలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏర్పాటు చేయించారు. అయితే శుక్రవారం పెట్టిన ఈ ఫ్లెక్సీలను హైడ్రా అధికారులు రాత్రికి రాత్రే తొలగించారు. పోస్టర్లను చించేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోనూ బీఆర్ఎస్ ఫ్లెక్సీలను డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగించారు. దీన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. హైడ్రా అధికారుల ముందే ధర్నాకు దిగారు.
హైడ్రా అధికారుల తీరుపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అసహనం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపేయడం దుర్మార్గమని అన్నారు. నెలల తరబడి కాంగ్రెస్, బీజేపీల ఫ్లెక్సీలు ఉండటం అధికారులకు కనిపించవా అని ప్రశ్నించారు. రజతోత్సవ సభ జరగకముందే ఫ్లెక్సీలు తొలగిస్తారా అని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం కాకుండా, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడ్డాక వడ్డీతో సహా కచ్చితంగా అప్పజెబుతామని స్పష్టం చేశారు.
పటాన్చెరు పట్టణంలో ఫ్లెక్సీలను తొలగించిన ఘటనపై బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు చింపేసే అధికారం డీఆర్ఎఫ్ సిబ్బందికి ఎక్కడిది అని ప్రశ్నించారు. సంబంధిత అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.