HYDRAA | మూడురోజుల పాటు ప్రజలకు బయటకు రావొద్దని హైడ్రా హెచ్చరించింది. బుధవారం నుంచి మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఈ మేరకు కీలక సూచనలు చేసింది. ఈ నెల 13 నుంచి 15 వరకు నగర పరిధిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. మేడ్చల్ జిల్లాతో పాటు సైబరాబాద్ పరిధిలోనూ వర్షాలుంటాయని తెలిపింది. పలుచోట్ల పది నుంచి 15 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల వరకు వర్షాపాతం ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో మూడురోజులు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సోషల్ మీడియా వేదికగా సూచించింది. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని.. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. అత్యవసర సమయాల్లో సహాయం కోసం 040 29560521, 9000113667, 9154170992 హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదించాలని కోరింది.
హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుసగా వర్షాలు దంచికొడుతున్నాయి. దాంతో రోడ్లపైకి వరద పోటెత్తుతుంది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరుతుంది. అదే సమయంలో ట్రాఫిక్‌కు తీవ్రంగా అంతరాయం కలుగుతున్న విషయం తెలిసిందే. రాగల నాలుగు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం కంపెనీలకు కీలక సూచనలు చేసింది. ఉద్యోగులకు ఎర్లీ లాగ్ అవుట్‌తో పాటు సాయంత్రం షిఫ్ట్ సమయాల్లో పని చేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ చేశారు. కంపెనీలు ఉద్యోగులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇండ్లకు వెళ్లేందుకు త్వరగా లాగవుట్ అవకాశం ఇవ్వాలని, సాయంత్రం డ్యూటీలు ఉన్న వారికి వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని కోరింది. దాంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని తెలిపింది.