HYDRAA | దుండిగల్, మార్చి 4 : హైడ్రా మరోసారి బడుగుల ఇండ్లపై పడగెత్తింది. ఇందిరమ్మ ఇండ్లలో నివాసం ఉంటున్న నిరుపేదలు, తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రేకుల రూమ్స్‌ను నిర్దయగా కూల్చివేసింది. దీంతో పలువురు స్థానికులు కంటతడి పెట్టారు. పేద ప్రజలమైన తమపై ప్రతాపం చూపుతున్న అధికారులు పెద్దల ఆక్రమణలను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రోడ్డుకు అడ్డంగా అధికారులు కూల్చివేసిన సామాన్లు వేసి బైఠాయించి నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ పాలనను ఇందిరమ్మ రాజ్యాంగ ప్రకటించుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా తమ ఇండ్లను కూల్చివేస్తుందని, ఇందిరమ్మ ఇండ్లలో కొందరు పిల్లర్లు, స్లాబులు వేసి శాశ్వత నిర్మాణాలు చేపట్టిన వారిని వదిలిపెట్టి చిన్నాచితక వ్యాపారాల కోసం ఏర్పాటు చేసుకున్న గదులను కూల్చడంపై మండిపడ్డారు. ఓట్ల ఓట్ల కోసం వచ్చే సమయంలో తమ చుట్టూ తిరిగే నేతలు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఈసారి ఎవ్వడు ఓట్లకు వచ్చిన తగిన బుద్ధి చెప్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ -2 నుండి బాలాజీ హిల్స్ కాలనీ, కేటీఆర్ కాలనీకి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఇందిరమ్మ కాలనీవాసులు తమ ఇండ్ల ముందర స్థలాలను ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న రేకుల రూములను హైడ్రాధికారులు మంగళవారం కూల్చివేయడం ఉద్రిక్తకు దారితీసింది. రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందనే నెపంతో గత కొంతకాలంగా బాలాజీ హిల్స్, కేటీఆర్ కాలనీవాసులకు, ఇందిరమ్మ ఇండ్ల నివాసుల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు హైడ్రా అధికారులు, సిబ్బందితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, భారీ పోలీసు బందోబస్తు,జెసిబి లతో ఇందిరమ్మ కాలనీ ఫేజ్ -2 కు చేరుకున్నారు. వస్తూనే రోడ్డు కు ఇరువైపు లో ఉన్న చిరు వ్యాపారాల కోసం ఏర్పాటుచేసిన రేకుల గదులను కూల్చివేశారు.
కొందరు సామాన్లు తీసుకుంటామని వేడుకున్న అధికారులు కనికరించలేదని, దీంతో తాము లక్షలాది రూపాయలు నష్టపోయామని పలువురు ఇందిరమ్మ కాలనీవాసులు బోరున విలపించారు. వృద్ధులమైన తాము చిన్నపాటి కొట్టును అప్పుచేసి ఏర్పాటు చేసుకున్నామని, ఇంకా అప్పు తీరక ముందే అధికారులు తమ ఇంటి ముందర షెడ్డును కూల్చివేయడంతో వృద్ధ దంపతులు విలవిలలాడారు. 70 ఏళ్ల పైచిలుకు వయసులో తాము ఎలా బతకాలంటూ విలపించారు. మరోవైపు హైడ్రా అధికారుల కూల్చివేతలను నిరసిస్తూ కాలనీవాసులు బాలాజీ హిల్స్ కాలనీ కమాన్ వద్ద రోడ్డుకు అధ్యయంగా అధికారులు కూల్చిన సామానువేసి బైఠాయించారు. ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్దలు కడుతున్న భవంతులు రోడ్డుకు అడ్డు రానప్పుడు తాము ఏర్పాటు చేసుకున్న చిన్నచిన్న గుడారాల్లాంటి రేకుల రూములు ఎలా అడ్డు వస్తాయని ప్రశ్నించారు. ప్రభుత్వానికి తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లను కూల్చుడేందని ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ముంటే రోడ్డుకు అడ్డంగా ఉన్నపెద్దల ఇండ్లను కూల్చాలని డిమాండ్ చేశారు. తామేమి చేయలేమని ధీమాతో ప్రభుత్వం తమ ఇబ్బందులు పాలు చేస్తుందని వాపోయారు.
ఇంతకు ఇంత ప్రభుత్వం అనుభవించి తీరుతుందని, ఇందుకేనా తాము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిందంటూ ఆందోళన చేపట్టారు. కనీసం తమకు ముందస్తు సమాచారం ఇచ్చిన సామాన్లు తీసి బయట పెట్టుకునే వారమని వాపోయారు. తమకు ఇండ్లు ఇచ్చుడేందుకు, కూల్చుడెందుకు…? తాము ఇప్పుడు ఎక్కడ తల దాచుకోవాలి అంటూ పలువురు విలపించారు. దళిత, గిరిజనులు నివాసముంటున్న తమపై ప్రతాపం చూస్తున్న అధికారులు మిగతా వారిపట్ల ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. కొద్దిసేపు కూల్చివేతలకు అడ్డుపడ్డారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆందోళనకారులను పక్కకు జరిపి కూల్చివేతలను చేపట్టారు. అంతకుముందు బాలాజీ హిల్స్ కాలనీ రోడ్డు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు.