హైదరాబాద్: హైదరాబాద్ నగర వాసులు హైడ్రా (HYDRAA) అంటేనే వణికిపోతున్నారు. వారాంతాలు వస్తే చాలు హైడ్రా అధికారులు బుల్డోజర్లకు పనిచెబుతున్నారు. ఆక్రమణల పేరుతో పెద్దలను వదిలి పేదలపై ప్రతాపం చూపిస్తున్నారు. కోట్లు విలువ చేసే భవంతులను వదిలి పూరి గుడిసెలు, రేకుల ఇండ్లను నేలమట్టం చేస్తున్నారు. మొన్న బతుకమ్మ పండుగ మొదటి రోజే గాజుల రామారంలో కూల్చివేతలు చేపట్టి పేదలకు నిలువ నీడ లేకుండా చేసిన హైడ్రా సిబ్బంది.. నేడు దసరా పండుగ తెల్లారే కొండాపూర్లో నిర్మాణాలను తొలగిస్తున్నారు.
కొండాపూర్లోని బిక్షపతి నగర్లో ఉన్న ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. శనివారం తెల్లవారుజామునే బుల్డోజర్లు, ప్రొక్రైనర్లతో వచ్చిన అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు ప్రారంభించారు. కూల్చివేతల వద్దకు మీడియాను కూడా అనుమంతించడం లేదు. రెండు కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను అడ్డుకుంటున్నారు.