హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HYDRAA) దూకుడు కొనసాగుతున్నది. నగరంలోని మాదాపూర్లో ఆక్రమణలను కూల్చివేస్తున్నది. అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్ రోడ్డులో ప్రధాన రహదారికి ఆనుకొని అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని బుల్డోజర్ల సాయంతో హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు భారీగా మోహరించారు.
అక్రమ నిర్మాణమని తేల్చిన జీహెచ్ఎంసీ.. భవన యజమానులకు గతేడాది నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే హైకోర్టు కూడా దానిని అక్రమ నిర్మాణమని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవనాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో ఆదివారం కూల్చివేత చేపట్టారు. భవనం మెయిన్ రోడ్డు పక్కనే ఉండటంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.